ఫెస్టివల్ సేల్స్ షురూ! ఆఫర్ల మాయలో పడకుండా ఉండాలంటే..

ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి సంస్థలు పండుగ సీజన్లలో ఆఫర్ల పేరుతో సేల్స్ నిర్వహిస్తుంటాయి. వీటి మోజులో పడి అవసరం లేకున్నా కొనుగోళ్లు చేయడం వల్ల మనకే నష్టం.

Advertisement
Update:2022-09-20 17:52 IST

ఒకప్పుడు అవసరమైతేనే షాపింగ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆఫర్లు పెట్టినప్పుడల్లా షాపింగ్ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి సంస్థలు పండుగ సీజన్లలో ఆఫర్ల పేరుతో సేల్స్ నిర్వహిస్తుంటాయి. వీటి మోజులో పడి అవసరం లేకున్నా కొనుగోళ్లు చేయడం వల్ల మనకే నష్టం. ఆఫర్ల మాయలో పడకుండా ఉండాలంటే కొనుగోళ్లు చేసేముందు ఇవి ఆలోచించుకోవాలి.

సేల్స్ సమయంలో ఈ-కామర్స్‌ సైట్లను ఓపెన్‌ చేస్తే.. బోలెడన్ని అట్రాక్టివ్ డిస్కౌంట్స్ కనిపిస్తుంటాయి. దాంతో ఆ వస్తువు నిజంగా అవసరమా? కాదా? అనేది విశ్లేషించుకోకుండానే కొనేస్తుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల తెలియకుండానే ఆఫర్ల మాయలో పడి మోసపోతారు. కాబట్టి ఏదైనా వస్తువు షాపింగ్ చేసేటప్పుడు దాని అవసరం నిజంగా ఉందో, లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. అవసరం ఉంది అనుకుంటేనే కొనాలి. ఆఫర్ ఉందని కొనకూడదు.

పండుగ సీజన్‌లో ఇంట్లో కొత్త వస్తువులు లేదా బట్టలు లాంటివి షాపింగ్ చేయాలనుకుంటారు చాలామంది. ఇలాంటి వాళ్లంతా పండుగ షాపింగ్ కోసం కొంత బడ్జెట్‌ను ముందే కేటాయించుకోవాలి. ఫెస్టివల్‌ సేల్స్‌లో ఏ వస్తువు ఎందులో తక్కువకు లభిస్తుందో తెలుసుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో వీలైనన్ని ఎక్కువ వస్తువులు కొనుక్కునేలా ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ పెట్టుకోకపోతే ఆఫర్ల మాయలో పడి ఎక్కువ కొనేసే ప్రమాదముంది.

ఇకపోతే చాలామంది ఆఫర్లు ఉన్నాయి కదా అని అప్పు చేసి మరీ కొంటుంటారు. ఇలా చేయడం వల్ల ఆఫర్ల మాయలో పడి ఎంతో నష్టపోయినట్టు అవుతుంది. చాలా ముఖ్యమైన లేదా ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న వస్తువుపై స్పెషల్ ఆఫర్ ఉంటే క్రెడిట్ కార్డు లేదా ఈఎమ్ఐలో కొనొచ్చు. అలా కాకుండా అవసరం లేని వస్తువు తక్కువకు వస్తుందని కొంటే ఈకామర్స్ సైట్ల మాయలో పడ్డట్టే.

ఈ-కామర్స్‌ సైట్‌లో ఏదైనా వస్తువు కొనేముందు దాని వాస్తవ ధరను పరిశీలించాలి. రాయితీ ఎంత ఉందో చూసుకోవాలి. ఇతర సైట్లలో దాని ధర ఎంతో తెలుసుకోవాలి. అప్పుడే నిజంగా ఆ వస్తువుపై మీకు ఎంత ఆఫర్ లభిస్తుందో తెలుస్తుంది. ఒక్కోసారి యూజర్లను ఆకర్షించడం కోసం సంస్థలు ధరను పెంచి దానిపై రాయితీ ప్రకటిస్తుంటాయి. అలాంటి మోసాల్లో చిక్కుకోకూడదంటే ప్రొడక్ట్ ఒరిజినల్ ధరను ప్రొడక్ట్ సైట్‌లో చెక్ చేసుకోవాలి.

ఫెస్టివల్ సేల్స్‌లో మొబైల్స్‌పై ఎక్కువగా ఆఫర్లు పెడుతుంటారు. దీంతో చాలామంది తమ మొబైల్ మంచిగా పనిచేస్తున్నా ఆఫర్‌‌లో వస్తుంది కదా అని కొత్త మొబైల్స్ కొంటుంటారు. మొబైల్స్ విషయంలో చాలామంది ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు. మొబైల్ మార్కెట్ వేగంగా మారిపోతుంది. ఈ రోజు కొన్న మొబైల్ రేపటికి పాతదైపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి కొత్త మోజులో పడకుండా మొబైల్ పనితీరుని బట్టి డెసిషన్ తీసుకోవాలి.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఫెస్టివల్ సేల్స్‌లో పాత మోడల్స్‌పై ఎక్కువ ఆఫర్లు ఇస్తుంటారు. సేల్‌లో ఏదో ఒకటి కొనాలన్న మోజులో పడి కొంతమంది ఆ వస్తువు పాతదా.. కొత్తదా గమనించకుండా కొనేస్తుంటారు. రెండు, మూడు సంవత్సరాల క్రితం విడుదలైన వస్తువులను ఇప్పుడు కొనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి, ఒక వస్తువును కొనేటప్పుడు దాంట్లో ఉన్న లేటెస్ట్ వెర్షన్‌ను కొనుగోలు చేయడం మంచిది.

Tags:    
Advertisement

Similar News