వరుస దెబ్బల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించే వారికి మద్యం అందించే విధానంలో కొన్ని సవరణలు చేపట్టింది.
ఇటీవల ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు వరుసగా షాక్‌లు తగులుతున్న విషయం తెలిసిందే. ఒకే నెలలో డీజీసీఏకు ఒకసారి రూ.30 లక్షలు, ఒకసారి రూ.10 లక్షలు జరిమానా చెల్లించింది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తప్ప తాగి ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై ఎయిర్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది తీవ్ర దుమారాన్ని సృష్టించింది.
అలాగే మరొక ఘటనలో ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ పొగ తాగాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనలో కూడా బాధ్యుడి పట్ల ఎయిర్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ ఎయిర్ ఇండియాకు తొలి ఘటనలో రూ. 30 లక్షలు, మరో ఘటనలో రూ.10 లక్షల జరిమానా విధించింది.
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించే వారికి మద్యం అందించే విధానంలో కొన్ని సవరణలు చేపట్టింది. ప్రయాణికులు ఎవరైనా మోతాదుకు మించి మద్యం తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి మద్యం సర్వ్ చేయడానికి నిరాకరించాలని సిబ్బందికి సూచనలు జారీ చేసింది.
అయితే ఇది గౌరవప్రదమైన పద్ధతిలోనే ఉండాలని, ప్రయాణికులను నొప్పించకుండా చూడాలని సూచించింది. ఇక మద్యం చాలు.. అని సూచించే సమయంలో వారిని తాగుబోతు అని పిలవకూడదని, వారితో వాగ్వాదానికి దిగకూడదని సిబ్బందికి ఎయిర్ ఇండియా సూచించింది.