క్రెడిట్ కార్డ్ vs లోన్.. ఏది బెస్ట్?
క్రెడిట్ కార్డులతో పోలిస్తే పర్సనల్ లోన్స్‌కు తక్కువ వడ్డీ ఉంటుంది. కాబట్టి, పెద్ద మొత్తాలకు లోన్స్ వాడడమే ఉత్తమం.
అవసరానికి చేతిలో డబ్బులు లేకపోతే వెంటనే గుర్తొచ్చేది క్రెడిట్ కార్డు. వస్తువు కొనేందుకే కాకుండా ఇతర ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డ్‌నే వాడుతుంటారు చాలామంది. అయితే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు మంచిదా? లోన్ మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?
అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా స్వైప్ చేసి క్యాష్ లోకి కన్వర్ట్ చేసుకోవడం లేదా క్రెడిట్ కార్డు నుంచి అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం వంటివి చేస్తుంటారు చాలామంది. అలాగే ఖరీదైన వస్తువుని ఈఎంఐలో కొనుగోలు చేసేందుకు కూడా క్రెడిట్ కార్డునే వాడుతుంటారు. అయితే రూ. లక్ష కంటే పెద్ద అమౌంట్‌లకు క్రెడిట్ కార్డుల కంటే లోన్ బెటర్ అంటున్నారు నిపుణులు. అదెలాగంటే..
క్రెడిట్ కార్డులతో పోలిస్తే పర్సనల్ లోన్స్‌కు తక్కువ వడ్డీ ఉంటుంది. కాబట్టి, పెద్ద మొత్తాలకు లోన్స్ వాడడమే ఉత్తమం. దీనివల్ల వడ్డీపై డబ్బు ఆదా అవ్వడమే కాకుండా లోన్ త్వరగా తీరిపోతుంది.
సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలు అధికంగా ఉంటాయి. పర్సనల్ లోన్ విషయంలో దీనిపై కొన్ని వెసులు బాట్లు ఉంటాయి.
క్రెడిట్ కార్డు సంస్థలతో పోలిస్తే.. పర్సనల్ లోన్ అందించే సంస్థలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు లేని రుణాలను అందిస్తుంటాయి. క్రెడిట్ కార్డుల్లో ఈ వెసులుబాటు ఉండదు.
కొన్ని ఈఎంఐలు కట్టిన తర్వాత డబ్బు ఉంటే లోన్‌ను ముందే క్లోజ్ చేసేయొచ్చు. చాలా సంస్థలు ఈ ప్రీ క్లోజర్ ఆప్షన్‌ను అందిస్తాయి. క్రెడిట్ కార్డులకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. కానీ, క్రెడిట్ కార్డు క్లోజర్‌కు ప్రీ పేమెంట్ పెనాల్టీ ఉంటుంది. పర్సనల్ లోన్స్‌లో ఇది ఉండదు.
క్రెడిట్ కార్డు బిల్లులతో ఇబ్బంది పడేవాళ్లు కూడా పెనాల్టీ ఛార్జీలను తగ్గించుకునేందుకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. లోన్ అమౌంట్‌తో కార్డు బ్యాలెన్స్ అంతా ఒకేసారి చెల్లించి.. లోన్ అమౌంట్‌ను తక్కువ ఈఎంఐలుగా పెట్టుకోవచ్చు.
చివరిగా తక్కువ మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు, పెద్ద మొత్తాలకు లోన్స్‌ను ఎంచుకుంటే మంచిదని నిపుణుల సలహా. అయితే క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ త్వరగా పొందొచ్చు. లోన్ అయితే ఒకట్రెండు రోజుల టైం పడుతుంది. డాక్యుమెంట్స్ కూడా అవసరమవుతాయి.