రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లోకి సూచీలు
రోజంతా నష్టాల్లోనే ట్రేడైన సెన్సెక్స్ మళ్లీ 80 వేల దిగువకు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాడన్న ఉత్సాహంతో నిన్న దూసుకెళ్లిన మార్కెట్ సూచీలు.. 24 గంటల్లోనే నష్టాల బాట పట్టాయి. ట్రంప్ అధ్యక్షుడుడైతే కలిగే లాభాలను ముందుగా అంచనా వేసిన మదుపర్లు.. నష్టాలను కొంత లేట్‌గానైనా గ్రహించారు. దీనికితోడు నేడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన ఉండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ క్షీణించడం వంటివి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఐసీఐసీఐ, రిలయన్స్ వంటి షేర్లలలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెన్సెక్స్ సుమారు 800 పాయింట్ల వరకు నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 24,200 దిగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 80,563.42 పాయింట్ల వద్ద లాభాల్లో (80,378.13) ప్రారంభమైంది. కొద్దిసేపటికి నష్టాల్లోకి జారుకున్నది. రోజంతా నష్టాల్లోనే ట్రేడైన సూచీ ఇంట్రాడేలో 79,419.34 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 836.34 పాయింట్ల నష్టంతో 79,541.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 284 పాయింట్లు నష్టపోయి 24,199 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్టమైన 84.37 స్థాయికి చేరింది. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2672 వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్‌లో ఎస్‌బీఐ షేరు మినహా మిగిలిన అన్నీ షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.