Home Rates | గచ్చిబౌలి.. కొండాపూర్ ప్రాంతాల్లో ఇండ్ల ధరలు ధగధగ.. టాప్-7 సిటీస్‌లోనే రికార్డ్..!
Home Rates | హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఇండ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. గచ్చిబౌలిలో మూడేండ్లలో చదరపు అడుగు ధర రూ.4790 నుంచి రూ.6,355లకు.. కొండాపూర్‌లో రూ.4650 నుంచి 6090లకు దూసుకెళ్లింది.
Home Rates | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరిలో సొంతింటి కల పెరిగిపోయింది. సొంతింటికి గిరాకీ పెరుగుతుండటంతో గత మూడేండ్లుగా ఇండ్ల ధరలు పెరుగుతున్నాయి. సగటున 13-33 శాతం ధరలు పెరిగాయని రియాల్టీ కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది. భారత్‌లో ఐటీ రంగ కేంద్రంగా మారింది. ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న గచ్చిబౌలి, పరిసర ప్రాంతాల్లో గరిష్ట రేట్ పలుకుతోంది. గత మూడేండ్లలో గరిష్టంగా 33 శాతం ఇండ్ల ధరలు పెరుగుతున్నాయి. 2020 అక్టోబర్‌లో చదరపు అడుగు ధర రూ.4,790 పలికితే 2023 అక్టోబర్‌లో రూ.6,355 పలుకుతున్నది. దాని పక్కనే కొండాపూర్ 31 శాతం ధరలు పెరిగాయి. మూడేండ్ల క్రితం 2020 అక్టోబర్‌లో చదరపు అడుగు గజం రూ.4,650 పలికితే ఇప్పుడు రూ.6090 పలుకుతోంది.
తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూర్ వైట్ ఫీల్డ్ ప్రాంతంలో 29 శాతం ఇండ్ల ధరలు పెరిగాయి. 2020 అక్టోబర్‌లో చదరపు అడుగు ధర రూ.4,900 నుంచి రూ.6,325 లకు దూసుకెళ్లింది. ఇండ్లకు గిరాకీతోపాటు ఇన్‌పుట్ కాస్ట్‌లు పెరగడంతో దేశంలోని ఏడు నగరాల్లో ఇండ్ల ధరలకు రెక్కలొచ్చాయని అనరాక్ రీజినల్ డైరెక్టర్ కం రీసెర్చ్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. నిర్మాణ ఖర్చులూ స్థలాల ధరలూ పెరగడంతోపాటు ఇండ్లకు గిరాకీ ఎక్కువ కావడం వల్లే కొన్నేండ్లుగా ఇండ్ల ధరలు పెరుగుతున్నాయని సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ రవి అగర్వాల్ తెలిపారు. గతంతో పోలిస్తే కరోనా మహమ్మారి తర్వాత ఇండ్ల కొనుగోలుదారుల ఆలోచనలు.. ఆకాంక్షలు.. ప్రాధాన్యాలు మారిపోయాయి. మెరుగైన వసతులు.. విశాలమైన గదులతో కూడిన ఇండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ-ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) పరిధిలో సగటున 13-27 శాతం మధ్య ఇండ్ల ధరలు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేటర్ నోయిడా వెస్ట్ ప్రాంతంలో 27 శాతం, ఎంఎంఆర్‌లోని లోవర్ పరేల్‌లో 21 శాతం ఇండ్ల ధరలు పెరిగాయి. బెంగళూరులోని థానిసండ్రా మెయిన్ రోడ్ పరిధిలో 27శాతం, సర్జాపూర్ రోడ్డు పరిధిలో 26 శాతం ఎక్కువయ్యాయి.
ముంబైకి సమీపంలోని పుణెలో గల ప్రముఖ ప్రాంతాలు వాఘోలీ, హించేవాడీ, వాకాడ్.. ఐటీ పరిశ్రమల జోన్‌లో ఉన్నాయి. వాఘోలీలో 25 శాతం, హింజేవాడీలో 22శాతం, వాకాడ్‌లో 19 శాతం పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని లోయర్ పరేల్, అంధేరీ, వర్లీ ప్రాంతాల్లోనూ 21 శాతం, 19 శాతం, 13 శాతం పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో సగటున 21 శాతం నుంచి 27 శాతం వరకూ ధరలు పెరిగాయి. గ్రేటర్ నోయిడా, సెక్టార్ 150 (నోయిడా), రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ (ఘజియాబాద్)లో 21 శాతం, సెక్టార్ 150లో 25, గ్రేటర్ నోయిడా వెస్ట్ ఏరియాలో 27 శాతం వృద్ధి చెందాయి.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పరిధిలోని పెరంబాక్కంలో 19 శాతం, గుడువంచేరీలో 17, పెరంబూర్‌లో 15 శాతం ధరలు పుంజుకున్నాయి. కోల్‌కతాలోని జోకాలో 24 శాతం, రాజార్‌హట్‌లో 19, ఈఎం బైపాస్ ప్రాంతంలో 13 శాతం ధరలు వృద్ధి చెందాయి.