కాపులకు జగన్ ఏం చేశారంటే..?
విశాఖలో కాపు సామాజిక భవనం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని చెప్పారాయన.
ప్రస్తుతం ఏపీలో కాపు ఓట్లపై విపరీతమైన చర్చ జరుగుతోంది. కాపు ఓట్లన్నీ జనసేనకే పడతాయని, జనసేనతో పొత్తు వల్ల టీడీపీ విపరీతంగా లాభపడుతుందని ఓ వర్గం బలంగా నమ్ముతోంది. జనసేన నేరుగా పోటీ చేస్తే కాపు ఓట్లు పడతాయి కానీ, టీడీపీ నేతలు పోటీ చేసిన చోట్ల ఓట్ షేరింగ్ జరగదు అని మరో వర్గం అంటోంది. అసలు కాపులకు పవన్ ఏం చేశారని, కాపులను వేధించిన, కాపు వర్గం శత్రువైన చంద్రబాబుతో కలవడం వల్ల ఆ వర్గం ఓటు కూటమికి పడదనే వాదన కూడా ఉంది. ఈ దశలో అసలు జగన్ కాపులకు ఏమేం చేశారనే విషయాన్ని విశదీకరించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.
విశాఖలో కాపు సామాజిక భవనం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని చెప్పారాయన. కాపుల పట్ల సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వివరించారు. కాపు సామాజిక భవనం కోసం రూ. 25 కోట్లు విలువ చేసే భూమిని కేటాయించడమే ఇందుకు నిదర్శనం అన్నారు వైవీ. శాఖ నడిబొడ్డున, హైవే పక్కన 50 సెంట్లు కేటాయించడం సంతోషించదగ్గ విషయం అని, కాపులతో పాటు యాదవుల సామాజిక భవన నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించామని చెప్పారు. తన రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు.
కాపులకు అండగా..
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున 31మంది కాపులకు జగన్ టికెట్లు ఇచ్చారు. ఆ 31 మందిలో 29 మంది విజయం సాధించగా, వారిలో ఐదుగురికి మంత్రి పదవులు దక్కాయి. కాపులకు రాజకీయ గౌరవం దక్కేలా చేసి, వారికి మంచి చేసిన సీఎం జగన్ కు అండగా నిలవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. కాపుల ఆరాధ్య దైవం రంగాను చంపిన వారికి, ముద్రగడ పద్మనాభంను అవమానించిన వారికి మద్దతు చెబుతారో, లేక కాపులకు మేలు చేసి జగన్ వైపు ఉంటారో కాపు సోదరులు నిర్ణయించుకోవాలని సూచించారు.