రాజ్యసభలో హోదాకోసం వైసీపీ గళం.. అనవసర విమర్శలకు ఆహ్వానం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ని గాడిలో పెట్టేందుకు తగిన గనులు ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీలు రాజ్యసభలో గళమెత్తడం విశేషం.

Advertisement
Update:2024-06-29 12:18 IST

కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధిస్తాం.. ఇది ఓకే

కేంద్రం మెడలు వంచి మరీ హోదా తెస్తాం.. ఇది కాస్త ఎక్స్ ట్రా

మా హయాంలోనే పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం.. ఇది ఓకే

పోలరం కట్టేది మేమే.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇది కాస్త ఎక్స్ ట్రా

ఈసారి కూడా మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వస్తాం.. ఇది ఓకే

వైనాట్ పిఠాపురం, వైనాట్ కుప్పం, వైనాట్ 175.. ఇది కాస్త ఎక్స్ ట్రా

సంక్షేమ పథకాల అమలులో జగన్ కి నూటికి నూరు మార్కులు రావొచ్చు కానీ, అవసరం లేని విషయాల్లో కూడా ఆవేశంగా స్పందించడంతో ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయి. అది ఈవీఎం మహత్యమా, ప్రజలు నేర్పిన పాఠమా.. అనేది తేల్చుకునే క్రమంలో వైసీపీ పాత తప్పులు రిపీట్ చేయకుండా ఉంటే కచ్చితంగా భవిష్యత్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే వైసీపీ నేతలు ఎక్కడా తగ్గేలా లేరు. 40శాతం ఓట్లు వచ్చిన తమకు ప్రజా బలం దండిగా ఉందని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

హోదాపై పోరాటం..

అధికార పార్టీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఎన్నసార్లు ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేశారు, ఎంత చిత్తశుద్ధితో పోరాటాలు చేశారనే విషయం అందరికీ తెలుసు. అడిగినప్పుడల్లా ఎన్డీఏకి రెండు సభల్లో వైసీపీ ఎంపీలు మద్దతివ్వడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు, కూటమిలో లేకపోయినా కూడా తాజాగా జరిగిన స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏకే జై కొట్టారు వైసీపీ ఎంపీలు. ఇక ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ని గాడిలో పెట్టేందుకు తగిన గనులు ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీలు రాజ్యసభలో గళమెత్తడం విశేషం.

అధికారంలో ఉన్నా లేకపోయినా ఏపీ హక్కులకోసం పోరాటం ఆపబోమని అంటున్నారు వైసీపీ ఎంపీలు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చలో ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరానికి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీలో ఎన్నికల అనంతర హింసను అరికట్టాలని కూడా ఆయన ప్రత్యేకంగా అభ్యర్థించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు బాబూరావు.

ఎంపీ బాబూరావు ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ రాజ్యసభలో తాము గళమెత్తామని, ఏపీ ప్రయోజనాలకోసం గొంతు సవరించామని అంటోంది వైసీపీ. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం తట్టుకోలేకపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే గళమెత్తొచ్చుకదా అని సెటైర్లు పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 25కి 22 స్థానాల్లో గెలిచిన వైసీపీ హోదాకోసం ఎందుకు డిమాండ్ చేయలేదని, ఇప్పుడు టీడీపీకి ఒత్తిడి చేయాలంటూ సలహాలివ్వడం ఎందుకని అడుగుతున్నారు నెటిజన్లు. కేంద్రం మెడలు వంచుతామన్న వాళ్లు ఐదేళ్లలో ఏం చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ హోదాకోసం కేంద్రాన్ని అభ్యర్థించడం వల్ల లాభముంటుందా అని అడుగుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News