దొరికిపోడానికే ట్వీట్లు వేస్తున్నారా..?
ఎన్నికల తర్వాత వైసీటీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మీది ఫేక్ న్యూస్ అంటే, మీది ఫేక్ న్యూస్ అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో మాజీ సైనికుడి ఇంటిని అధికారులు కూల్చి వేశారా..? లేక పడేసింది కేవలం ప్రహరీగోడనా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగా హడావిడి జరిగింది. నేరుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోగి దిగారు. అసలా గొడవ ఇప్పటిది కాదంటూ, వైసీపీ హయాంలోనే ఫిర్యాదులు ఇచ్చారని, అప్పుడే కూల్చివేతకు ఆదేశాలు కూడా వెలువడ్డాయని టీడీపీ సాక్ష్యాలు చూపించింది. అయితే తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మరో మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి వేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేశారని, వైసీపీకి ఓటు వేశారంటూ కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ఆయన్ను వేధిస్తున్నారని, 60మంది బలగంతో వచ్చి మరీ అధికారులు ఆయన ఇంటిని కూల్చి వేశారని, ఇంకెన్నాళ్లు ఏపీలో ఈ దౌర్జన్యాలంటూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కాస్త ఆవేదనాభరితంగా ట్వీట్ వేశారు. వాస్తవంగా జరిగేవాటికి సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్ లకు చాలా తేడా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత ట్వీట్ వేశారంటే అది ఎంతోకొంత వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అయితే ఇల్లు కూల్చేశారంటూ పుష్పశ్రీవాణి ట్వీట్ వేయడం ఇక్కడ విశేషం. రోడ్డుని ఆక్రమించి కట్టిన ప్రహరీగోడ కూల్చేస్తే.. ఇంటిని కూల్చేశారంటూ మాజీ డిప్యూటీ సీఎం ట్వీట్ వేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.
సోషల్ మీడియా వార్..
ఎన్నికల తర్వాత వైసీటీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మీది ఫేక్ న్యూస్ అంటే, మీది ఫేక్ న్యూస్ అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ఈ ట్వీట్లు వేసే సమయంలో గతాన్ని మరచిపోయినట్టు నేతలు ప్రవర్తించడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. గతంలో మీరు చేసిందే ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్నారు కదా, ఇందులో వింతేముంది అనే నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు.