క్యాంప్ ఆఫీస్ లో వరుస మీటింగ్ లు.. జగన్ ని కలసిన కీలక నేతలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు ముందుగా ఈనెల 21న ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పొందినా జగన్ క్యాంప్ ఆఫీస్ లో మాత్రం నేతల సందడి కొనసాగుతోంది. ఎన్నికల్లో గెలిచినవారు, ఓడినవారు ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీలు, ఎంపీలతో విడివిడిగా జగన్ సమావేశమయ్యారు. ఇక క్యాంప్ ఆఫీస్ దారి వ్యవహారం మీడియాలో హైలైట్ కావడం విశేషం. మొత్తానికి జగన్ క్యాంప్ ఆఫీస్ మాత్రం నిత్యం చర్చల్లో ఉంటోంది.
ఈరోజు ఉదయం ఈవీఎంలపై జగన్ ఆసక్తికర ట్వీట్ వేశారు. ఈవీఎంలకంటే బ్యాలెట్ పోరు మేలని చెప్పారాయన. దీనిపై ఉదయం నుంచి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జగన్ ని పలువురు పార్టీ నేతలు కలిశారు. కోలగట్ల వీరభద్రస్వామి, అదీప్‌రాజ్, పొన్నాడ సతీష్, సింహాద్రి చంద్రశేఖర్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. తదితరులు జగన్ తో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
పులివెందుల పర్యటన వాయిదా..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు ముందుగా ఈనెల 21న ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. ఈనెల 22న జరగాల్సిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం రెండు రోజులు ముందుకొచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులతో జగన్ ఈనెల 20న సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన ఎంపీ అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 20న జరగబోతున్న వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.