వైసీపీలో లుకలుకలు.. ఆర్కే తర్వాత మరో రాజీనామా

పార్టీలో ఇన్నాళ్లూ అసంతృప్తితో ఉన్న నేతలు ఒక్కసారిగా బయటపడుతున్నారు. తమకు ప్రయారీటీ లేదని భావిస్తున్నవారంతా ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు రాజీనామా అస్త్రాల్ని సంధిస్తున్నారు.

Advertisement
Update:2023-12-11 14:42 IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత రాజకీయాలను రచ్చకీడ్చింది. అంతలోనే ఆ పార్టీలో మరో కలకలం రేగింది. గాజువాక నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం, రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ఏడాదిలో ఇది వైసీపీకి ఇది ఎదురుదెబ్బ అనుకోవాల్సిందే.

గాజువాకలో పవన్ కల్యాణ్ ని ఓడించి వైసీపీ తరపున బలంగా నిలబడ్డారు ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఈసారి ఆయన ఆ స్థానాన్ని కొడుకు దేవన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. గాజువాకలో నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. ఈ సమయంలో సడన్ గా దేవన్ రెడ్డి పార్టీని వీడటం సంచలనంగా మారింది. ఈ రాజీనామాపై దేవన్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి ఇంకా స్పందించలేదు కానీ.. ఆయన కూడా పార్టీకి దూరమవుతారనే సంకేతాలు కనపడుతున్నాయి.

ఎందుకిలా..?

పార్టీలో ఇన్నాళ్లూ అసంతృప్తితో ఉన్న నేతలు ఒక్కసారిగా బయటపడుతున్నారు. తమకు ప్రయారీటీ లేదని భావిస్తున్నవారంతా ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు రాజీనామా అస్త్రాల్ని సంధిస్తున్నారు. మరి వీరందర్నీ సీఎం జగన్ పిలిపించి బుజ్జగిస్తారా, లేక బెట్టు చూపిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఓవైపు బాలినేని శ్రీనివాసులరెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీలో ఉంటూనే చేయాల్సినంత డ్యామేజీ చేస్తున్నారు. ఇటు వరుస రాజీనామాలు కలవరపెడుతున్నాయి. వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News