వైసీపీలో అసలైన ముసలం..

ఈసారి ఆయనకు రామచంద్రాపురం నుంచి జగన్ టికెట్ ఇస్తే పార్టీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు పిల్లి సుభాష్. ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానని తేల్చి చెప్పారు.

Advertisement
Update:2023-07-23 16:06 IST

వైరివర్గం వ్యతిరేక ప్రచారం కాదు, సీఎం జగన్ చెబుతున్న దుష్టచతుష్టయం పన్నిన వ్యూహం కూడా కాదు. వైసీపీలో అసలైన ముసలం పుట్టింది. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ తోనే ఉన్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయనకు రామచంద్రాపురం నుంచి జగన్ టికెట్ ఇస్తే పార్టీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు పిల్లి సుభాష్. ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానని తేల్చి చెప్పారు.

ఏపీలో రామచంద్రాపురం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి కూడా ఆ నియోజకవర్గం నుంచి వేణుకి టికెట్ ఖాయమనే సంకేతాలు వెలువడటంతో పిల్లి సుభాష్ వర్గం అలకబూనింది. ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టుకుంది. ఈ సంగతి తెలిసి జగన్ సంధికోసం పిల్లి సుభాష్ ని పిలిపించారు. అప్పట్లో ఎంపీని జగన్ మందలించినట్టు చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తాను పార్టీని కూడా ధిక్కరించే అవకాశముందని ఎంపీ పిల్లి సుభాష్ తేల్చి చెప్పారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తోనే ఉన్నారు ఎంపీ పిల్లి సుభాష్. ఆయన్ను కూడా జగన్ అంతే గౌరవంగా చూసుకున్నారు. తొలి కేబినెట్ లోనే మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత మండలి గొడవతో ఆయనను రాజ్యసభకు పంపించారు. కానీ ఆయనన సొంత నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన పెత్తనం పెరిగిపోయింది. ఇది నచ్చని ఎంపీ, తన కొడుక్కి ఆ సీటు కావాలన్నారు. కానీ జగన్ కుదరదన్నారు. జగన్ మాటగా పార్టీ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే వచ్చేసారి టికెట్ ఇస్తామని ఖాయంగా చెప్పారు. దీంతో పిల్లి సుభాష్ వర్గం రగిలిపోయింది. తాడేపల్లి పంచాయితీ కూడా సరిపోలేదు. అసంతృప్తి గళం ఇప్పుడు సెగలు రేపుతోంది.

‘‘కార్యకర్తలు, క్యాడర్‌ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ తోనే ఉన్నాం. వేణుతో కలిపి నన్ను సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారు. క్యారెక్టర్‌ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పాను’’ అని పిల్లి సుభాష్‌ అన్న మాటలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి.

Tags:    
Advertisement

Similar News