పోస్టల్ బ్యాలెట్ పై తగ్గేదే లేదు.. సుప్రీంకు వైసీపీ
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడతాయన్న దశలో కూడా పోస్టల్ బ్యాలెట్ అంశం కాకరేపుతోంది.
ఏపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వేడి ఇంకా చల్లారలేదు. హైకోర్టు తీర్పుతో వైసీపీ సంతృప్తి చెందలేదు. న్యాయం కోసం నేరుగా సుప్రీం తలుపు తట్టారు వైసీపీ నేతలు. అధికారిక సీల్, హోదా లేకపోయినా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్ ని ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైసీపీ సుప్రీంలో సవాల్ చేసింది. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న నియమ, నిబంధనలే ఏపీలో కూడా కొనసాగించాలని కోరింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని వైసీపీ తప్పుబట్టింది.
అనేక మలుపులు..
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడతాయన్న దశలో కూడా పోస్టల్ బ్యాలెట్ అంశం కాకరేపుతోంది. వైసీపీపై వ్యతిరేకతతో ఉద్యోగులు టీడీపీవైపు మొగ్గుచూపారన్న వార్తల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ అంశం ఇరు పార్టీలకు కీలకంగా మారింది. టీడీపీ ఫిర్యాదుతో ఏపీ సీఈఓ పోస్టల్ బ్యాలెట్ పై సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇవి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం అని వైసీపీ వాదిస్తోంది. ఈ క్రమంలో ఏపై హైకోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు ఆ పిటిషన్ ని కొట్టివేసింది. ఎన్నికల పిటిషన్(ఈపీ) దాఖలు చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. దీంతో వైసీపీ నేతలు నేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది. సీలు లేని పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటు అవుతాయా లేవా అనే విషయాన్ని సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ కు వదిలేస్తుందా..? లేక ఏపీ వరకే ఇలాంటి నిబంధనలు ఎందుకు అమలు చేశారంటూ ఈసీని ప్రశ్నించి, వైసీపీకి న్యాయం చేస్తుందా..? వేచి చూడాలి.