అమరావతికి అప్పులు వద్దు, నిధులివ్వండి
అమరావతిని రాజధానిగా వైసీపీ నేతలు దాదాపుగా ఒప్పుకున్నట్టే. పార్లమెంట్ లో కూడా అమరావతికోసం వారు ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ఏకైక రాజధానిగా వైసీపీ ఎప్పుడూ అమరావతిని సమర్థించలేదు. ఆ మాటకొస్తే ఈసారి కచ్చితంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం అంటూ ప్లేస్, డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్పారు వైసీపీ నేతలు. కానీ తొలిసారిగా పార్లమెంట్ లో వైసీపీ నేతలు అమరావతి కోసం మాట్లాడటం విశేషం. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న రూ.15వేల కోట్లు రుణంగా కాకుండా, గ్రాంట్ గా ఇవ్వాలని కోరారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికోసం ఆయన పట్టుబట్టారు.
కేంద్ర బడ్జెట్ లో అమరావతికి రూ.15వేల కోట్ల కేటాయింపులు తమ ఘనతేనని చెప్పుకుంటోంది కూటమి ప్రభుత్వం. వాస్తవానికి అది కేంద్రం హామీతో వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకునే అప్పు మాత్రమే. ఎప్పటికైనా ఏపీ ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఈ విషయంలో వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. అమరావతికి ఇచ్చేది అప్పు అయితే, ఇక కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సాధించింది ఏంటని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. అప్పుని కూడా తన గొప్పగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరపున ఎంపీ మిథున్ రెడ్డి.. ఆ అప్పుని గ్రాంట్ గా మార్చాలని కేంద్రాన్ని కోరడం విశేషం.
సూపర్ సిక్స్.. సారీ సిక్స్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని అన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడి నెల దాటిపోయినా ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, ఆ పథకాల అమలుకి గడువు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో శాంతిభద్రతల అంశంపై కూడా పార్లమెంట్ లో కాస్త గట్టిగానే ప్రస్తావించారు మిథున్ రెడ్డి. శాంతిభద్రతలు దిగజారితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న తననే తన నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటున్నారని, తనపై దాడి జరిగితే, తిరిగి తనపైనే పోలీసులు కేసు పెట్టారని వాపోయారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలని, హింసకు చరమ గీతం పాడాలని ఆమేరకు కేంద్రం చొరవ తీసుకోవాలని పార్లమెంట్ లో కోరారు మిథున్ రెడ్డి.