నాలుక మడత పడకుండా చూసుకో.. కుర్చీ సంగతి తర్వాత
కుర్చీ సంగతి తర్వాత ముందు లోకేష్ నాలుక మడతపడకుండా చూసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు పేల్చారు. బాబూ లోకేష్..! అంటూ ట్వీట్ వేశారు.
ఏపీ రాజకీయాల్లో కుర్చీ మడతపెట్టే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్ కి కుర్చీ మడతపెడతారంటూ.. చంద్రబాబు, లోకేష్ చేసిన కామెంట్లపై వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కుర్చీ సంగతి తర్వాత ముందు లోకేష్ నాలుక మడతపడకుండా చూసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు పేల్చారు. బాబూ లోకేష్..! అంటూ ఆయన ట్వీట్ వేశారు.
పొత్తులు తేలాక..
టీడీపీ, జనసేన పొత్తులు తేలాక ఎవరిపై ఎవరు రాళ్లు విసురుతారో, ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పొత్తులు ప్రకటించాక ఏపీలో మంచి వినోదం మొదలవుతుందని చెప్పారు. ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీచేయాలనుకుంటున్నాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్ ది రెండు నాల్కల ధోరణి అన్నారు మల్లాది. వాలంటీర్ల పై చంద్రబాబు, పవన్ గతంలో ఏంమాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారని తెలిపారు.
ఇటీవల జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఈ గొడవ మొదలైంది. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన ఏపీలో ఎలక్షన్ మూడ్ గురించి మాట్లాడారు. స్లీవ్స్ మడతపెడుతూ సీఎం జగన్ చెప్పిన ఆ డైలాగ్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. వైసీపీ అభిమానులంతా ఆ మాటల్ని వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నారు, సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ కుర్చీ మడతపెట్టే డైలాగ్ ని తెరపైకి తెచ్చింది. అయితే ఈ కుర్చీ మడతపెట్టడం అనేది ఇటీవల సోషల్ మీడియాలో బూతుగా మారిపోవడంతో చంద్రబాబు, లోకేష్ మాటల్ని జనం చీదరించుకుంటున్నారు.