వైసీపీ విముక్త ఏపీ..! పవన్ పై మొదలైన మాటల దాడి..

పవన్ కల్యాణ్‌ నిలకడ లేని మనిషి అంటూ ధ్వజమెత్తారు మంత్రి ఆదిమూలపు సురేష్. పవన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని మండిపడ్డారు.

Advertisement
Update:2023-04-05 19:58 IST

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు పవన్ కల్యాణ్. బీజేపీ అజెండా కూడా అదేనని స్పష్టం చేశారు. దీంతో సహజంగానే వైసీపీ నేతలకు మండింది. కొన్నాళ్లుగా పవన్ పై ఆ పార్టీ నేతలెవరూ కామెంట్లు చేయడంలేదు. ఇటీవల అంతా ఎమ్మెల్సీ హడావిడి, టీడీపీపై విమర్శలతోనే వైసీపీకి కాలం సరిపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఢిల్లీనుంచి వైసీపీ విముక్త ఏపీ అంటూ పిలుపునిచ్చేసరికి ఏపీ మంత్రులు జనసేనానిని టార్గెట్ చేశారు. రాజకీయ వ్యభిచారి అంటూ పవన్ పై.. మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిలకడలేని మనిషి..

పవన్ కల్యాణ్‌ నిలకడ లేని మనిషి అంటూ ధ్వజమెత్తారు మంత్రి ఆదిమూలపు సురేష్. పవన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఓ వైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు టీడీపీ ముసుగులో పని చేస్తున్నారని ఆరోపించారు. అసలు పవన్‌ కల్యాణ్‌ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో, ఎన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులకు టికెట్లు ఇప్పిస్తాడో.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాలకు పోటీ చేసే దమ్ము ఏ పార్టీకైనా ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ సొంతగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతుందని.. సంక్షేమ పథకాల గురించి చెప్పి తాము ఓట్లు అడుగుతామన్నారు మంత్రి సురేష్.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం వాపు మాత్రమేనని, అది చూసి బలుపు అనుకుని టీడీపీ భ్రమపడుతోందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారని, వారి పేర్లు కూడా చెబితే సంతోషిస్తామన్నారు. అలా చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా అంటూ సవాల్ విసిరారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే దొరకడంలేదని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు లేవని సీఎం జగన్ స్పష్టత ఇచ్చారన్నారు. 

Tags:    
Advertisement

Similar News