కడప ఎంపీగా జగన్ పోటీ..! వైసీపీ క్లారిటీ

నిజంగానే అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తారా, జగన్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారా..? వారిద్దరూ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను మార్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది.

Advertisement
Update:2024-07-10 09:22 IST

కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని, అక్కడ్నుంచి జగన్ పోటీ చేస్తారని ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పుకార్లపై స్పందించడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజంగానే అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తారా, జగన్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారా..? వారిద్దరూ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను మార్చుకుంటారా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. దీంతో వైసీపీ అధికారికంగా ఈ వార్తలపై స్పందించింది.

అసత్య ప్రచారం..

జగన్ పులివెందుల స్థానానికి, అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తారని.. వారిద్దరూ తమ తమ స్థానాలు మార్చుకుని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం శుద్ధ అబద్ధమని అన్నారు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.సురేష్ బాబు. ఇదంతా టీడీపీ దుష్ప్రచారమేనని ఆరోపించారు. టీడీపీ అనుకూల మీడియాలోనే మొదట ఈ ఊహాగానాలు ప్రచారమయ్యాయని, కల్పిత కథలల్లారని అన్నారాయన. ఆ తర్వాత చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి స్పందించడం కూడా వారి మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనన్నారు సురేష్ బాబు. ప్రజల్ని గందరగోళ పరిచేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

ఎందుకీ దుష్ప్రచారం..?

కేవలం 11మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ, అసెంబ్లీలో తన వాదన సరిగా వినిపించడానికి అవకాశం లేదని విశ్లేషకులంటున్నారు. అసెంబ్లీ స్పీకర్ కు జగన్ లేఖ రాసినా.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తారని, కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదు కానీ, రేవంత్ రెడ్డి కౌంటర్ తర్వాత ఈ వాదనకు మరింత బలం చేకూరింది. దీంతో వైసీపీ వెంటనే ఖండన ప్రకటన విడుదల చేసింది. అదంతా టీడీపీ దుష్ప్రచారం అని కొట్టిపారేసింది. 

Tags:    
Advertisement

Similar News