వైసీపీ ఎన్నికల శంఖారావం.. బస్సుయాత్ర షెడ్యూల్ విడుదల

ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ బస్సుయాత్ర మొదలవుతుంది. ఈ నెల 26న యాత్ర ప్రారంభిస్తామని, నవంబర్ 9లోపు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు కవర్ చేస్తామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Advertisement
Update:2023-10-13 17:03 IST

ఇటీవల విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు సీఎం జగన్. అందులో బస్సు యాత్ర ఒకటి. అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31వరకు 2నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుందని, మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని చెప్పారాయన. ప్రతి రోజూ మూడు మీటింగ్‌ లు జరుగుతాయని, ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, సాధికారత గురించి ప్రజలకు వివరించి చెప్పాలని నేతలకు సూచించారు. ఈ బస్సు యాత్రలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పాల్గొంటారని చెప్పారు జగన్. ఈ యాత్రకు సంబంధించి తాజాగా వైసీపీ షెడ్యూల్ విడుదల చేసింది.

ఉత్తరాంధ్ర ఫస్ట్..

ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ బస్సుయాత్ర మొదలవుతుంది. ఈ నెల 26న యాత్ర ప్రారంభిస్తామని, నవంబర్ 9లోపు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు కవర్ చేస్తామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌ కే దక్కుతుందన్నారు బొత్స.

ఇచ్ఛాపురం నుంచి అనకాపల్లి..

ఈ నెల 26న ఇచ్చాపురంలో వైసీపీ బస్సుయాత్ర మొదలవుతుంది. 27న గజపతినగరం, 28న భీమిలి, 30 పాడేరు, 31 ఆముదాలవలసలో యాత్ర చేపడతారు మంత్రులు. ఇక నవంబర్ నుంచి పార్వతీపురంలో యాత్ర మొదవులవుతుంది. మాడుగుల, నరసన్నపేట, ఎస్.కోట, గాజువాక, రాజాం, సాలూరు, అనకాపల్లితో ఉత్తరాంధ్రను కవర్ చేస్తారు. ఆ తర్వాత షెడ్యూల్ మళ్లీ ప్రకటిస్తారు.

2024 ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం జగన్ ఇదివరకే ప్రకటించారు. మార్చి నాటికి ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బస్సు యాత్రతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించినట్టవుతుంది. యాత్రకు వచ్చే స్పందన చూసి.. మిగతా కార్యక్రమాలను రూపొందించే అవకాశముంది.


Tags:    
Advertisement

Similar News