జగనన్న అమ్మఒడిపై టీడీపీ ప్రభావం ఉంటుందా..?

ఇటీవల టీడీపీ మినీ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అమ్మఒడి జిరాక్స్ కాపీ కూడా ఉంది. ఆ పథకం పేరు తల్లికి వందనం.

Advertisement
Update:2023-06-28 08:48 IST

జగనన్న అమ్మఒడి నిధులు నేడు విడుదలవుతాయి. వరుసగా నాలుగో ఏడాది వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమం మొదలు పెడతారు సీఎం జగన్. 10రోజులపాటు అమ్మఒడి ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేస్తామని తెలిపింది.

కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా.. అందులో ఒకరికే అమ్మఒడి అమలవుతుంది. తల్లి ఖాతాలో ప్రతి ఏడాదీ 15వేల రూపాయలు జమ అవుతుంది. అయితే ఇందులో 2వేల రూపాయలు ప్రభుత్వం మినహాయించుకుంటుంది. స్కూల్ మెయింటెనెన్స్, మరుగుదొడ్ల నిర్వహణకు ఈ మినహాయింపు నిధులు ఖర్చు చేస్తారు.

చంద్రన్న తల్లికి వందనం..

ఇటీవల టీడీపీ మినీ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అమ్మఒడి జిరాక్స్ కాపీ కూడా ఉంది. ఆ పథకం పేరు తల్లికి వందనం. అమ్మఒడి లాగే ఒక్కో తల్లి ఖాతాలో 15వేల రూపాయలు జమ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి విడివిడిగా 15వేల రూపాయలిస్తామని చెప్పారు చంద్రబాబు. నలుగురు పిల్లలు ఉన్న కుటుంబంలో అందరూ స్కూల్ లేదా కాలేజీకి వెళ్తుంటే ఏడాదికి ఆ కుటుంబానికి 60వేల రూపాయలు అందిస్తామని చెప్పారాయన. 2వేల రూపాయల మినహాయింపు కూడా తమ ప్రభుత్వం తీసుకోదన్నారు.

జగనన్న అమ్మఒడితో పోలిస్తే, టీడీపీ తల్లికి వందనం కాస్త ఘనంగానే ఉంది. గతంలో వైసీపీ కూడా అమ్మఒడికి ఒక పిల్లాడు అనే నిబంధన పెట్టలేదు. కానీ అధికారంలోకి వచ్చాక, ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా ఒకరికే అమ్మఒడి అన్నారు. దీంతో టీడీపీ ఈ పాయింట్ ని హైలెట్ చేస్తూ తల్లికి వందనం అంటూ కొత్త పథకం తెస్తామంటోంది. టీడీపీ పోటీ పథకాన్ని చూసి జగన్ అమ్మఒడిలో మార్పులు చేర్పులు ఏమయినా చేస్తారేమో చూడాలి. 2019 ఎన్నికలకు ముందు జగన్, సామాజిక పింఛన్ ను పెంచుతామని మేనిఫెస్టో హామీ ఇవ్వగా, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వెంటనే ఆ పని చేసింది. ఇప్పుడు జగన్ కూడా టీడీపీ పోటీ పథకాన్ని చూసి అమ్మఒడికి మార్పులు చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి తమ పథకాలను కాపీ కొట్టారని టీడీపీపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు, అమ్మఒడికి అప్ డేట్ ఉంటుందో లేదో చెప్పలేకపోతున్నారు. 

Tags:    
Advertisement

Similar News