ఈవీఎంల ట్యాంపరింగ్..? అందుకే వైసీపీ ఓటమి..!!

ఈవీఎంలలో ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు కారుమూరి. వైసీపీ పరాజయానికి ఈవీఎంలు కారణం అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-06-05 23:24 IST

ఏపీ ఫలితాలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని స్వయంగా జగనే అన్నారు. మరి జగన్ ఓటమికి కారణాలేంటి..? ప్రజల్ని తప్పుగా అంచనా వేశారా, తక్కువ అంచనా వేశారా..? ఎన్డీఏ కూటమి చెప్పిన అబద్ధాలకు ప్రజలు మోసపోయారా..? లేక జగన్ ద్వారా లబ్ధిపొంది కూడా ప్రజలు ఆయన్ను మోసం చేశారా..? ఈ ప్రశ్నలకు ఓ పట్టాన సమధానం దొరకడం కష్టం. అయితే కొందరు నేతలు మరో కొత్త లాజిక్ చెబుతున్నారు. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాము ఊహించని ఫలితాలు వచ్చాయంటున్నారు వైసీపీ నేతలు.

అన్ని వర్గాలకు మంచి జరిగేలా పాలన చేసిన జగన్, రెండోసారి ఏపీకి ముఖ్యమంత్రి కాలేకపోవడం బాధాకరం అని అన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుందని ఈ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైందని అన్నారాయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని భూతంలా చూపించి కూటమి నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ ప్రజల్ని నమ్మించారని చెప్పారు. లక్షలాదిమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్, ప్రజల ఆస్తుల్ని ఎందుకు లాక్కుంటారని ప్రశ్నించారు కారుమూరి.

ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు కానీ ఫలితాలు మాత్రం వేరేలా వచ్చాయన్నారు మాజీ మంత్రి కారుమూరి. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందనే అనుమానం తనకు కూడా ఉందన్నారు. భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్‌ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో 1.8 లక్షల ఓట్లు పోలైతే 30 వేలు అధికంగా కనబడ్డాయన్నారు. ఈవీఎంలలో ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు కారుమూరి. వైసీపీ పరాజయానికి ఈవీఎంలు కారణం అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

జగన్ కి 151 సీట్లు వస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, కూటమికి 164 సీట్లు వస్తే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓటమిపై సరైన విశ్లేషణ జరపాల్సిందిపోయి, నెపం ఈవీఎంలపై వేస్తే వైసీపీ ఎప్పటికీ పుంజుకోలేదని విమర్శిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News