ఇడుపులపాయలో జగన్, విజయమ్మ.. వైఎస్ఆర్ కి ఘన నివాళి

ప్రార్థన అనంతరం జగన్ ని దగ్గరకు తీసుకున్న విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులంతా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement
Update:2024-07-08 08:19 IST

వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద జగన్, విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈరోజు ఉదయాన్నే విజయమ్మ వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం జగన్ ఇతర నేతలు అక్కడికి వచ్చారు. జగన్ ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు తల్లి విజయమ్మ. కోడలు భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయనను స్మరించుకుంటూ దైవ ప్రార్థన చేశారు.


బయటి శత్రువులు ఎంతమంది ఉన్నా.. కుటుంబ సభ్యులంతా కలసి ఉండి వారిని ఎదుర్కోవాలని, అందరి ఆలోచనలు ఒకటయ్యే మార్గం చూపాలని ప్రార్థనలు జరగడం విశేషం. ప్రజలకు మేలు చేసి వైఎస్ఆర్ వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, జగన్ కూడా అలాగే పేదల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రార్థన అనంతరం జగన్ ని దగ్గరకు తీసుకున్న విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులంతా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ 75వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇడుపులపాయలో కార్యక్రమం అనంతరం జగన్ తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. పార్టీ శ్రేణులతో కలస ఆయన క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కి నివాళులర్పిస్తారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News