జగన్ రెడ్డి కాదు.. ఇకపై జగనన్న గారూ అంటా..!
మూడు రాజధానులు ఎక్కడ, పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలెక్కడ.. అని ప్రశ్నించారు షర్మిల.
వైసీపీ నేతలకు బాగానే పని పెడుతున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తన తొలి మీటింగ్ లోనే జగన్ రెడ్డీ అంటూ దీర్ఘాలు తీసి ముఖ్యమంత్రిని కించపరిచినట్టు మాట్లాడారామె. ఆమె మాటలపై వైసీపీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సీనియర్ నేతలు షర్మిల వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. దీంతో ఆమె ఈరోజు మరింత వెటకారంగా మాట్లాడారు. ఇకపై తాను జగన్ రెడ్డి గారూ అనబోనని.. జగనన్న గారూ అంటానని చెప్పారు.
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో జనంలోకి వెళ్తున్నారు షర్మిల. సాధారణ ప్రయాణికురాలి లాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తనతోటి ప్రయాణికులతో మాట్లాడి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీపై మరిన్ని సెటైర్లు పేల్చారు. ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.
టైమ్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే..
ఏపీ అభివృద్ధి షర్మిలకు కనపడటం లేదంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారామె. ప్లేస్ వారు చెప్పినా సరే తనను చెప్పమన్నా సరే, టైమ్ వారు చెప్పినా సరే తనను చెప్పమన్నా సరే అంటూ సినిమా డైలాగ్ కొట్టారు. వారు చేసిన అభివృద్ధి చూడటానికి తాను రెడీగా ఉన్నానన్నారు. మూడు రాజధానులు ఎక్కడ, పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలెక్కడ.. అని ప్రశ్నించారు. వారు చేసిన అభివృద్ధి చూడాలని ఏపీలోని ప్రజలంతా కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని సెటైర్లు పేల్చారు షర్మిల.