సీఎం జగన్‌ తరపున నామినేషన్‌ దాఖలు

రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం జగన్‌ వైపే మళ్లీ చూస్తున్నారని మనోహర్‌రెడ్డి అన్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Advertisement
Update:2024-04-22 16:11 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్‌ సోమవారం పులివెందులలో దాఖలైంది. అక్కడి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి ఒక సెట్‌తో కూడిన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, వైసీపీ నేతలు జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఈరోజు ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశామని ఆయన చెప్పారు. ఈనెల 25వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. 25న ఇక్కడ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఆరోజు మధ్యాహ్నం తర్వాతే జగన్‌ నామినేషన్‌ వేస్తారని మనోహర్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం జగన్‌ వైపే మళ్లీ చూస్తున్నారని మనోహర్‌రెడ్డి అన్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారని, ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుందని వివరించారు. ఇప్పటివరకు 21 జిల్లాల్లో యాత్ర సాగిందన్నారు. బస్సు యాత్ర ముగిసిన వెంటనే.. మరో సెట్‌తో సీఎం జగన్‌ స్వయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకొని నామినేషన్‌ వేస్తారని ఆయన వివరించారు.

Tags:    
Advertisement

Similar News