పులివెందులలో జగన్ కి అర్జీల వెల్లువ..
ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పులివెందులకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని కలిసేందుకు ఆయన ఇష్టపడుతున్నారు.
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ని కలిసేందుకు నియోజకవర్గ ప్రజలు పోటెత్తారు. పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ఈ ఉదయం నుంచే జనం బారులు తీరారు. వారిని పలకరించి, వారి వద్ద అర్జీలు స్వీకరిస్తున్నారు జగన్. క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఈరోజు జగన్ ని కలిశారు.
తన పర్యటన తొలిరోజు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తని జగన్ పరామర్శించారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబుని హెచ్చరించారు కూడా. ఈరోజు లింగాల మండలం పెద్దకూడాలకు వెళ్తారు జగన్. అక్కడ పార్టీ నేతల్ని ఆయన పరామర్శిస్తారు. రేపు ఇడుపులపాయలో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకులకు హాజరవుతారు.
ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పులివెందులకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఆయన కలిసేందుకు ఇష్టపడుతున్నారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారందర్నీ ఓపిగ్గా పలకరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. పరామర్శ యాత్రను అధికారికంగా ఖరారు చేయకపోయినా జగన్ వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. నాయకులు, కార్యకర్తల్ని పరామర్శిస్తున్నారు.