సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఏపీ సీఎస్‌గా శ్రీలక్ష్మి?

శ్రీలక్ష్మి కంటే ముందు 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్ కుమార్, 1988 బ్యాచ్‌కు చెందిన అధికారిణి పూనం మాలకొండయ్య ఉన్నారు. అయితే, సీఎం జగన్ మాత్రం శ్రీలక్ష్మి వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2022-11-12 16:50 IST

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? పదవీ విరమణ చేయబోతున్న సమీర్ శర్మ స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మిని నియమించబోతున్నారా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. 1988 బ్యాచ్‌కు చెందిన ఎర్రా శ్రీలక్ష్మిపై ఉన్న సీబీఐ కేసును కూడా తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిన్న మొన్నటి వరకు ఆమె నియామకంపై వైఎస్ జగన్ కాస్త సందిగ్దంలో ఉన్నారు. కానీ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మికి మార్గం సుగమమం అయినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. సీనియార్టీ లిస్టు ప్రకారం చూసుకుంటే.. శ్రీలక్ష్మి కంటే ముందు 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్ కుమార్, 1988 బ్యాచ్‌కు చెందిన అధికారిణి పూనం మాలకొండయ్య ఉన్నారు. అయితే, సీఎం జగన్ మాత్రం శ్రీలక్ష్మి వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ఓబలాపురం మైనింగ్ గనుల కేటాయింపు కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలతో కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయించారు.

కాగా శ్రీలక్ష్మి తనను ఏపీ క్యాడర్‌కు మార్చాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు క్యాట్‌ను ఆశ్రయించారు. సీఎం వైఎస్ జగన్ అండతోనే ఆమె ఆ రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకు 2020 డిసెంబర్‌లో ఆమె ఏపీ క్యాడర్‌కు మారారు. ప్రస్తుతం ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే శ్రీలక్ష్మిని ఏపీ క్యాడర్‌కు తీసుకొని వచ్చి సీఎస్‌ను చేస్తారనే ప్రచారం జరిగింది.

కాగా, శ్రీలక్ష్మిపై సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉండటంతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్‌ల నుంచి అభ్యంతరాలు రావడంతో వైఎస్ జగన్ ఆ ఆలోచన విరమించుకున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీలక్ష్మి కంటే ఇద్దరు అధికారులు మాత్రమే సీనియర్లుగా ఉన్నారు. దీంతో ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, సీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినా.. దానికి కేంద్రం ఆమోదం కావల్సి ఉన్నది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో వైఎస్ జగన్‌కు సత్సంబంధాలే ఉండటంతో.. ఆమోద ముద్ర పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News