ఈ ఫలితాలు శకుని పాచికలు -జగన్

ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోందని, వారికి మరి కొంత సమయం ఇచ్చి చూద్దామన్నారు జగన్.

Advertisement
Update:2024-06-13 15:44 IST

ఏపీలో ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. పార్టీ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారనే విషయాన్ని మరచిపోవద్దని వారికి చెప్పారు. మనం చేసిన మంచి ఇంకా ప్రజలకు గుర్తుందని, ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారాయన. ఎవరెన్ని కుట్రలు చేసినా, వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు.


హనీమూన్..

ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోందని, వారికి మరి కొంత సమయం ఇచ్చి చూద్దామన్నారు జగన్. శిశుపాలుడు తప్పుల్ని శ్రీకృష్ణుడు లెక్కించినట్టు.. చంద్రబాబు తప్పులను మనం లెక్కించాలన్నారు. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది కాబట్టి.. నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని, కానీ శాసన మండలిలో మనం గట్టిగా పోరాటం చేద్దామని ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు జగన్.

షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఇవ్వాల్సిన రైతు భరోసా, విద్యాదీవెన లబ్ధి ప్రజలకు చేరలేదని చెప్పారు జగన్. ఆ పథకాల అమలుతోపాటు.. కూటమి మేనిఫెస్టోలోని పథకాల అమలు బాధ్యత కూడా వారిపై ఉందన్నారు. వాటిని అమలు చేయడంలో తప్పులు చేస్తే ప్రజల తరపున పోరాడదామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరుతానని ఎమ్మెల్సీల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు జగన్. 

Tags:    
Advertisement

Similar News