కోడి పందేలపైనా ఏడుపేనా..?

కోడిపందేలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలైనట్లుగా ఎల్లోమీడియా పిచ్చిరాతలు రాసింది. సంక్రాంతి పండుగకు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున కోళ్ళపందేలు ఆడటం దశాబ్దాలుగా వస్తోంది.

Advertisement
Update:2023-01-08 10:02 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమిరాయోలో ఎల్లోమీడియాకు అర్థ‌మవుతున్నట్లు లేదు. అందుకనే పాచిపోయిన వార్తలను పట్టుకుని కొత్తగా ఇప్పుడే జరుగుతోందన్నట్లుగా కలరింగ్ ఇచ్చి బ్యానర్ కథనాలు అచ్చేసుకుంటోంది. ఇలాంటి పాత కథనాలకు తాజా ఉదాహరణ కోళ్ళపందేలపై బ్యానర్ స్టోరీ రావటమే. వైసీపీ నేతలు కోడిపందేలకు బరులను రెడీ చేసేస్తున్నారు. భీమవరం కలెక్టరేట్ దగ్గరలోనే 20 ఎకరాల్లో అంతా సిద్ధం చేసేస్తున్నారట. ఏర్పాట్లు జరుగుతున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా ఎవరూ నోరెత్తటంలేదట.

కోడిపందేలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలైనట్లుగా ఎల్లోమీడియా పిచ్చిరాతలు రాసింది. సంక్రాంతి పండుగకు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున కోళ్ళపందేలు ఆడటం దశాబ్దాలుగా వస్తోంది. కోళ్ళపందేలు జరగకూడదన్నది కోర్టు నిర్ణయం. అయితే అది అమల్లోకి రావటంలేదు. ఎందుకంటే కోడిపందేలను నియంత్రించటం లేదా నిషేధించటం ప్రభుత్వానికి సాధ్యంకాదు. కారణం ఏమిటంటే.. కోళ్ళపందేల విషయంలో అధికారపార్టీ, ప్రతిపక్షాలనే తేడాలేదు. మిగిలిన ఏ విషయంలో అయినా పార్టీ నేతల మధ్య తేడాలుంటాయేమో కానీ కోళ్ళపందేల విషయంలో అన్నీపార్టీల నేతలు ఒకటైపోతారు.

కోళ్ళపందేలను నిర్వహించటం రెండుజిల్లాల్లోని గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తారు. అన్నీపార్టీల నేతలు ఏకమైపోయినాక ఇక పోలీసులు, ప్రభుత్వం చేసేదేముంటుంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కేసును విచారించిన కోర్టు కోళ్ళపందేలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అయినా అప్పుడు కోళ్ళపందేలు ఎలా జరిగినాయి..? ఈ విషయాన్ని అప్పట్లో ఎల్లోమీడియా ఎందుకు హైలైట్ చేయలేదు..? ఎందుకంటే తమ వార్తలు, కథనాల వల్ల చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశ్యంతోనే కళ్ళుమూసుకుని కూర్చున్నది.

ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలనే బ్యానర్ కథనాలు మొదలుపెట్టింది. చంద్రబాబు హయాంలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో కోళ్ళపందేలు అప్పట్లో కొందరు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏల ఆధ్వర్యంలోనే జరిగాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కోళ్ళపందేలను నిషేధించటం సాధ్యంకాదని అందరికీ తెలుసు. అయినా ఇప్పుడు బ్యానర్ కథనాలు అచ్చేశారంటే జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని తప్ప మరోటికాదు.

Tags:    
Advertisement

Similar News