ఎల్లోమీడియాది బ్లాక్ మెయిలింగేనా..?
అసలు పెమ్మసాని లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని, ఎన్ఆర్ఐలను పార్టీ తరఫున అసలు పోటీచేయించకూడదని చెప్పింది.
బ్లాక్ మెయిల్ చేయటం, అవతలివాళ్ళని లొంగదీసుకోవటమే ఎల్లో మీడియా బిజినెస్సనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. లేకపోతే 15 రోజుల క్రితం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కథనాలిచ్చిన ఎల్లోమీడియాలో ఇప్పుడు అదే వ్యక్తినుండి పెద్దఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు కనబడతాయి..? మామూలుగా ఎవరైనా ఏమిచేస్తారు ? తనపైన ఒక మీడియాలో వ్యతిరేకంగా వార్తలు లేదా కథనాలు వస్తే ఇక ఆ మీడియాకు దూరంగా ఉంటారు. ముందు తనపైన వచ్చిన వార్తలు, కథనాలు తప్పని ఖండిస్తారు. ఆ తర్వాత ఏదన్నా సందర్భంలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల్సొచ్చినా ఇవ్వకుండా దూరంగా పెట్టేస్తారు.
అయితే ఇక్కడ మాత్రం సదరు వ్యక్తి తనకు వ్యతిరేకంగా కథనాలు రాసిన మీడియాకే పెద్దఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారంటే ఏమిటర్థం..? బ్లాక్ మెయిల్ చేసి సదరు వ్యక్తిని ఎల్లోమీడియా లొంగదీసుకున్నదనే అర్థం. విషయం ఏమిటంటే.. పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఎన్ఆర్ఐ గుంటూరు ఎంపీగా టీడీపీ తరఫున పోటీచేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పెమ్మసానే ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెమ్మసానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియాలో కథనం వచ్చింది.
అదేమిటంటే.. అసలు పెమ్మసాని లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని, ఎన్ఆర్ఐలను పార్టీ తరఫున అసలు పోటీచేయించకూడదని చెప్పింది. డబ్బుందన్న ఏకైక కారణంతో ఇలాంటి వాళ్ళకి టికెట్లిచ్చి ప్రోత్సహిస్తే పార్టీలో కష్టపడుతున్న నేతలు, క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెప్పింది. ఎన్ఆర్ఐలు గెలిచినా, ఓడినా మళ్ళీ జనాల్లో పెద్దగా కనబడరన్నట్లుగా తేల్చేసింది. ఇలాంటి వాళ్ళవల్ల పార్టీకి దీర్ఘకాలంలో నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని డైరెక్టుగా పేరుపెట్టి పెమ్మసానికి వ్యతిరేకంగా రాసింది.
సీన్ కట్ చేస్తే ఇప్పుడదే పెమ్మసాని పేరు, ఫొటోతో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఎల్లోమీడియాలో కనబడుతోంది. ఎన్ఆర్ఐ పెమ్మసానికి టికెట్ ఇవ్వకూడదని కథనం రాసిన ఎల్లోమీడియా మరి ఆయనిచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఎలా తీసుకున్నది..? ఇక్కడ విషయం ఏమిటంటే.. ఎల్లోమీడియాకు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేట్లుగా ఎల్లోమీడియానే బ్లాక్ మెయిల్ చేసిందని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముందు వార్త రాయటం తర్వాత వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేట్లుగా లొంగదీసుకోవటమే ఎల్లోమీడియా బిజినెస్ అయిపోయిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వకూడదన్న వాదనకే కట్టుబడుండేట్లయితే వాళ్ళిచ్చే అడ్వర్టైజ్మెంట్లను కూడా తీసుకోకూడదనే వాదన పెరిగిపోతోంది. పెమ్మసాని ఇప్పుడు ఇంతపెద్దఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నది పోటీచేసే ఉద్దేశ్యంతో తప్ప మరోటికాదని అందరికీ తెలుసు.