స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీదే గెలుపు
పూర్తిస్థాయి బలం ఉండటంతో ఈ గెలుపును వైసీపీ ముందే ఊహించింది. అయినా నాలుగు స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలబడటంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. పూర్తిస్థాయి బలం ఉండటంతో ఈ గెలుపును వైసీపీ ముందే ఊహించింది. అయినా నాలుగు స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలబడటంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది.
శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లు వేయగా, రామారావుకు 632 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అనేపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి.
గురువారం చేపట్టిన స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లాలో బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. ఈ జిల్లాలో మొత్తం 1105 ఓట్లు ఉండగా, 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వాటిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు కవురు శ్రీనివాస్‌కు 481 రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి.
కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. మొత్తం 1136 ఓట్లలో 53 ఓట్లు చెల్లలేదు. మధుసూదన్‌కు 988 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి మోహన్‌రెడ్డికి 85 ఓట్లు వచ్చాయి. మరోపక్క 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.