లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో ఓం బిర్లాకే వైసీపీ మద్దతు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో వైసీపీ స్పీకర్‌ ఎంపిక సందర్భంగా ఎవరికి మద్దతిస్తుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Update:2024-06-26 09:49 IST

దేశంలో అత్యంత ఆసక్తికరంగా మారిన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా వైసీపీ తన మద్దతును ఎన్డీఏ అభ్యర్థి ఓంబిర్లాకే ప్రకటించింది. బుధవారం లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. లోక్‌సభలో బీజేపీకి సొంత బలం లేకపోవడం, మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ స్పీకర్‌ ఎంపిక అంశాన్ని తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. డిప్యూటీ స్పీకర్‌ పదవి తమకు కేటాయిస్తే స్పీకర్‌ ఎన్నికకు తాము సహకరిస్తామని ఇండియా కూట‌మి మెలిక పెట్టింది. దీంతో ఈ వ్యవహారం ఎన్నిక దాకా వెళ్లింది. తాజాగా ఇది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.

వైసీపీని మద్దతు కోరిన ఎన్డీఏ అగ్ర నేతలు..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో వైసీపీ స్పీకర్‌ ఎంపిక సందర్భంగా ఎవరికి మద్దతిస్తుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తమ మద్దతు ఓంబిర్లాకే అని మంగళవారం ప్రకటించారు. బుధవారం జరిగే స్పీకర్‌ ఎన్నికలో ఓంబిర్లాకు మద్దతివ్వాలని ఎన్డీఏ అగ్ర నేతలు వైసీపీ అధినాయకత్వాన్ని కోరారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లాంఛనంగా జరిగే సభాపతి ఎన్నికలో ఓంబిర్లాకు మద్దతివ్వాలని నిర్ణయించినట్ట వెల్లడించారు.

లాలూచీ రాజకీయాలకు వైసీపీ వ్యతిరేకం..

లాలూచీ రాజకీయాలకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందువల్లే ఇండియా కూటమి అభ్యర్థికి తాము మద్దతివ్వడం లేదని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ స్పీకర్‌ పదవి కోసం పట్టుబడితే.. టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల లాలూచీ రాజకీయాలకు తెరలేపిందని ఆయన చెప్పారు. అందువల్లే ఓంబిర్లాకు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయించిందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News