చంద్రబాబు కూడా నాకు బంధువు.. ఇక హద్దులు దాటవద్దు లోకేష్

బంధువుల కంపెనీలన్నీ తనవే అని తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కు చెందిన హెరిటేజ్ కంపెనీ కూడా తనదే అవుతుంది అని విజయసాయిరెడ్డి కొత్త విషయం చెప్పారు.

Advertisement
Update:2022-07-16 12:09 IST

ఏపీలో మద్యం సరఫరా చేస్తున్న అదాన్‌ డిస్టలరీ సంస్థ తనదే అంటూ తెలుగుదేశం పార్టీ గత కొద్దిరోజులుగా చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై కౌంటర్ ఇచ్చారు.

ఒకే అబద్దాన్ని పదిసార్లు చెబితే అదే నిజమవుతుందన్న సిద్ధాంతాన్ని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని విమర్శించారు. శ్రీనివాసన్ అనే ఒక వ్యక్తి అటు అదాన్ కంపెనీలో.. ఇటు కాకినాడ ఎస్ఈజెడ్ లో కామన్ డైరెక్టర్ గా ఉండడాన్ని చూపెడుతూ విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీలో శ్రీనివాసన్ ఉన్నాడు కాబట్టి అదాన్ సంస్థ విజయసాయిరెడ్డికే చెందినది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకొని కోతికి కొబ్బరి చిప్ప దొరికిన తరహాలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, నారా లోకేష్, ఎల్లో మీడియా కలిసి లేనిపోని ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

విహాన్ ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వడ్లమూడి నాగరాజు డైరెక్టర్‌గా ఉన్నారని ఇతడు చంద్రబాబు నాయుడుకు బినామీ అన్న విషయం అందరికీ తెలుసన్నారు. వడ్లమూడి నాగరాజుకు చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు కియా మోటార్స్ డీలర్ షిప్ కూడా ఇప్పించార‌ని విజయసాయిరెడ్డి వివరించారు. ఇదే వడ్లమూడి నాగరాజు హెరిటేజ్ ఫుడ్స్ లోనూ, ఇతర హెరిటేజ్ సంస్థల్లోనూ డైరెక్టర్ గా ఉన్నారని విజయసాయిరెడ్డి బయటపెట్టారు. అదాన్ సంస్థలో శ్రీనివాసన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు లేవనెత్తుతున్న లాజిక్కు.. హెరిటేజ్ సంస్థల్లో వడ్లమూడి నాగరాజుకు వర్తించదా అని వైసీపీ ఎంపీ ప్రశ్నించారు.

అలాగే నంద్యాల విష్ణురాజు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడని, చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లినా ఆయన వెనుక ఈయనే ఉంటారని, అలాంటి విష్ణు రాజు హెరిటేజ్ ఫుడ్స్ లో పాటు అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో కూడా డైరెక్టర్ గా ఉన్నారని మరి దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విష్ణురాజు అటు హెరిటేజ్ ఫుడ్స్ తో పాటు అమర్ రాజా బ్యాటరీస్ లో కూడా డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి అమర్ రాజా సంస్థ కూడా చంద్రబాబు నాయుడి సంస్థ అని తానంటే ఒప్పుకుంటారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఒక కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి ఇతర చాలా కంపెనీలో కూడా డైరెక్టర్ గా ఉండడం సహజంగా జరిగేదేనన్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఆ వ్యక్తి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలన్నీ ఒకే గ్రూపున‌కు చెందినవి, ఒకే వ్యక్తికి చెందినవి అని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఉదాహరణకు దివీస్ ల్యాబ్ కిరణ్ తనతో సన్నిహితంగా ఉంటారని, అదే సమయంలో కిరణ్ సోదరి.. నారా బ్రాహ్మణితో అత్యంత సన్నిహితంగా ఉంటారని, రోజు కలుస్తూ ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతోనూ వారికి సంబంధాలు ఉన్నాయని అంతమాత్రాన డివీస్ ల్యాబ్ విజయసాయిరెడ్డిది గానీ, లేక నారా బ్రాహ్మణికి చెందిన కంపెనీ గానీ అయిపోతుందా అని ప్రశ్నించారు .

వ్యక్తిగత సంబంధాల ఆధారంగానో, లేకుంటే ఒకే వ్యక్తి పలు కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారన్న ఉద్దేశంతోనో.. ఆ కంపెనీలను ఒకే వ్యక్తివి అని చెప్పడం సరైనది కాదని విజయసాయిరెడ్డి హితవు పలికారు. టీడీపీ ఆరోపణల నేపథ్యంలో అసలు అదాన్ సంస్థ ఏంటి ? అన్న ఉద్దేశంతో రికార్డులన్నీ తెప్పించాన‌ని, మొత్తం ఏపీలో అమ్ముతున్న మద్యంలో అదాన్ సంస్థ కేవలం మూడు శాతం మాత్రమే సరఫరా చేస్తుందని, అందులో శ్రీనివాసన్ తో పాటు మరో వ్యక్తి డైరెక్టర్ గా ఉన్నారని, ఆ ఇద్దరి వ్యక్తులతో కూడా తనకు ఎలాంటి పరిచయాలు, సంబంధాలు లేవని విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు.

రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇదే తరహాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తే.. అందుకు పదిరెట్లు ఎక్కువగా వారిపై తప్పుడు ప్రచారం చేయించే శక్తి తనకు ఉందని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తాను ఇప్పటివరకు నారా బ్రాహ్మణి గురించి కానీ, భువనేశ్వరి గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదని, కేవలం రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ వచ్చానని తెలుగుదేశం పార్టీ ఇదే తరహాలో వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ వెళ్తే ఇకపై తాను కూడా అన్ని పరిధిలు దాటి పదిరెట్లు అధికంగా ఎదురు ప్రచారం చేయించాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు .

అసభ్యకరంగా తమపై సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిందని అందుకే తాము కూడా అంతేస్థాయిలో స్పందించాల్సి వస్తోందని విజయసాయిరెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇలా వ్యక్తిగతంగా, అనుచితంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మానేస్తే.. వైసీపీ విలువలకు కట్టుబడిన పార్టీగా మరుక్షణమే ఇటు వైపు నుంచి కూడా అలాంటి ప్రచారం ఆపేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

బంధువుల కంపెనీలన్నీ తనవే అని తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కు చెందిన హెరిటేజ్ కంపెనీ కూడా తనదే అవుతుంది అని విజయసాయిరెడ్డి కొత్త విషయం చెప్పారు. ఎన్టీఆర్ మనవడు తారకరత్న.. తన భార్య సోదరీ కూతుర్ని వివాహం చేసుకున్నారని, ఆ లెక్కన చంద్రబాబు కూడా తనకు బంధువు అవుతారని, అన్న వ‌రస అవుతాడని విజయసాయిరెడ్డి వివరించారు. ఆ బంధుత్వం ఆధారంగా చంద్రబాబు ఆస్తులు తనవి అయిపోతాయా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News