ఎన్నికల తర్వాత ఆల్‌ టైం ఫ్రీ బాబు

అసలు తనకు బుచ్చయ్య చౌదరి ఎలా గురువు అవుతారని ప్రశ్నించారు. ఆయనేమైనా దగ్గరుండి విలువిద్య నేర్పించారా అని ప్రశ్నించారు. ఇంకా నయం గురుదక్షిణ కింద బొటనవేలు అడగలేదు అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-06-02 17:29 IST

మహానాడు మాయనాడులా సాగిందని.. ఈ మాయనాడే టీడీపీకి ఆఖరి నాడు అవుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ నిరుద్యోగులకు 2వేలు చొప్పున ఇస్తానని ప్రకటించి మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తీరా ఎన్నికల సమయంలో కొందరికి మాత్రమే వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అంటూ బాబు మోస‌పు మాట‌లు చెబుతున్నాడ‌న్నారు. గతంలో ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఇప్పుడు ఇంటికి రెండు ఉద్యోగాలంటున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇంట్లో మాత్రం సొంత పుత్రుడికి, దత్తపుత్రుడికి ఉద్యోగం గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు.

రైతులకు 20వేలు ఇస్తానంటున్నారని.. కేవలం చంద్రబాబు సొంత సామాజికవర్గంలోని రైతులకు మాత్రమే ఇస్తారేమో అని విమర్శించారు. అమ్మకు వందనం అంటూ 2019లోనే హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే వాగ్దానం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ను వాడు వీడు అంటూ మాట్లాడి పథకాలకు ఆయన పేర్లు తీసేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

తెలంగాణ నుంచి రెండు, కర్నాటక నుంచి రెండు, ఏపీ నుంచి కొన్ని పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టోను తయారు చేశారని వ్యాఖ్యానించారు. దసరాకు ఫుల్‌ మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు చెబుతున్నారని.. తెలంగాణ ఎన్నికల కోసం అక్కడి పార్టీలు ప్రకటించే స్కీంను కాపీ కొట్టి ఫుల్‌ మేనిఫెస్టో తయారు చేస్తారన్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకవైపు తిడుతూనే తనను ఆయనకు శిష్యుడిగా చెప్పుకుంటున్నారని.. అసలు తనకు బుచ్చయ్య చౌదరి ఎలా గురువు అవుతారని ప్రశ్నించారు. ఆయనేమైనా దగ్గరుండి విలువిద్య నేర్పించారా అని ప్రశ్నించారు. ఇంకా నయం గురుదక్షిణ కింద బొటనవేలు అడగలేదు అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత‌ ఆల్‌ఫ్రీ అవతారం ఎత్తిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఆల్‌ టైం ఫ్రీ బాబు అవడం ఖాయమన్నారు.

Tags:    
Advertisement

Similar News