పట్టాభి ఓ కోన్‌కిస్కా.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబే.. - వైసీపీ ఎంపీ మార్గాని భరత్
గన్నవరం కోర్టు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని మెడికల్ రిపోర్టులు పరిశీలించాక ధృవీకరించిందని.. ఇంకా ఎందుకు ఈ ప్రశ్నలని అన్నారు.
టీడీపీ నాయకులకు పోలీసు వ్యవస్థ అంటే బాగా చులకన అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ వచ్చిన వార్తలపై వైసీపీ ఎంపీ భరత్‌ను మీడియా ప్రశ్నించగా, పైవిధంగా స్పందించారు. అసలు పట్టాభి ఎవరు.. ఓ కోన్‌కిస్కా.. దీనికంతటికీ కథ, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం చంద్రబాబేనని భరత్ చెప్పారు. ఇంత వాదన అనవసరమని, ఈ ఘటనలో వైసీపీ ప్రోద్బలం ఏమైనా ఉందంటే.. వాటి ఆధారాలను న్యాయస్థానంలో పొందుపరచవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. గన్నవరం కోర్టు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని మెడికల్ రిపోర్టులు పరిశీలించాక ధృవీకరించిందని.. ఇంకా ఎందుకు ఈ ప్రశ్నలని అన్నారు.
తెలంగాణాలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఏదో టూరిస్టుల్లా వచ్చి నాలుగు కళ్లబొల్లి మాటలు చెబితే ఆహా.. ఓహో.. అనే రోజులు పోయాయని, వారి నాటకాలన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు. లోకేష్ గత నాలుగు సంవత్సరాలు శుభ్రంగా పడుకుని ఇప్పుడు 'యువగళం.. నా గళం.. అంటూ పర్యటిస్తే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ఈ అబ్బా, కొడుకు, దత్తపుత్రుడు చర్యలను వారికి అనుకూల ఎల్లో మీడియా ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఇటువంటి నాయకులను మోయవలసిన అవసరం లేదని ఎంపీ భరత్ చెప్పారు.