కన్ఫర్మ్ చేసుకునే బురద చల్లుతున్నారా..?
టికెట్లు దక్కని వాళ్ళు జగన్ పైన మండిపోతున్నారు. బీసీలంటే జగన్ కు చిన్నచూపని, ఎస్సీలకు జగన్ అన్యాయం చేస్తున్నాడంటూ గోల మొదలుపెట్టారు.
వైసీపీలో కొందరు ఎమ్మెల్యే, ఎంపీల వైఖరి విచిత్రంగా ఉంటోంది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావటమే జగన్మోహన్ రెడ్డి టార్గెట్. అందులోనూ 175కి 175 సీట్లలో గెలవాలని చాలాసార్లు చెప్పారు. ఇందులో భాగంగానే పెద్ద కసరత్తు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు ఇవ్వటంలేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చుతున్నారు. మరికొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీచేయిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న మార్పులన్నీ జగన్ వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే టికెట్లు దక్కని వాళ్ళు జగన్ పైన మండిపోతున్నారు. బీసీలంటే జగన్ కు చిన్నచూపని, ఎస్సీలకు జగన్ అన్యాయం చేస్తున్నాడంటూ గోల మొదలుపెట్టారు. దాన్ని ఎల్లోమీడియా వెంటనే అందుకుని పెద్ద బ్యానర్ కథనాలతో రెచ్చిపోతోంది. ఇప్పుడు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వ్యవహారం అలాగే ఉంది. బీసీల బతుకులింతే, బీసీల మాటకు విలువలేదంటు గోల మొదలుపెట్టారు. ఆ ఆరోపణలను ఎల్లోమీడియా బాగా హైలైట్ చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. దాదాపు ఐదేళ్ళు సంజీవ్ కుమార్ ఏమీ మాట్లాడకుండా సరిగ్గా ఇప్పుడే గొంతువిప్పారు.
ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో ఈయన ప్లేసులో ఎంపీగా మంత్రి గుమ్మనూరు జయరాంను జగన్ ఎంపిక చేశారు. తనకు టికెట్ దక్కదన్న విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే జగన్ పైన బురదచల్లారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా ఇదే పద్దతి. ఎలాగూ టికెట్లు దక్కవని తేలిపోయింది కాబట్టి తమ కులాన్ని అడ్డంపెట్టుకుని జగన్ పైన బురదచల్లేస్తున్నారు.
సంజీవ్ కుమార్, బాబు, పద్మావతి లాంటి చాలామందికి 2019లో టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. టికెట్లిచ్చినప్పుడు జగన్ గొప్పోడన్నారు. టికెట్ లేదనేటప్పటికి జగన్ బీసీ, ఎస్సీలను అణగదొక్కేస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా బీసీ నేతలను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా వైసీపీ తరపున జగన్ పోటీచేయించిన విషయం చూస్తున్నదే. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు, మేయర్, ఛైర్మన్ పదవుల్లో కూడా బీసీలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. వ్యక్తిగతంగా తమకు టికెట్లు రాదనేటప్పటికి బురదచల్లటం స్టార్ట్ చేశారు.