రౌడీలను వెంటేసుకొని తిరిగితేనే రాజకీయాల్లో ముందడుగు - వైసీపీ ఎమ్మెల్యే
రౌడీలను వెంటేసుకొని తిరిగేవారే రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారని ఆవేదన చెందారు. ఒక్కోసారి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా..? ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానా..? అనిపిస్తుందన్నారు
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనలోని అసంతృప్తిని, ఆవేదనను దాచుకోలేకపోతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన ఇటీవల పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ ప్రమేయం పెరిగిపోవడం, వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి రమేష్ పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు.
తాజాగా ఆయన పరోక్షంగా జోగి రమేష్ మంత్రి అయిన తీరుపైన విమర్శలకు దిగారన్న చర్చ నడుస్తోంది. మైలవరం మండలం చంద్రాల సొసైటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాద్ తాను పాత తరం నాయకుడిలా మిగిలిపోయానని ఆవేదన చెందారు. పదిమంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతకాక తాను ఇలా ఉండిపోయానని వ్యాఖ్యానించారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయాల్లో పరిస్థితి చాలా మారిపోయిందన్నారు.
రౌడీలను వెంటేసుకొని తిరిగేవారే రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారని ఆవేదన చెందారు. ఒక్కోసారి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా..? ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానా..? అనిపిస్తుందన్నారు . సగటు వ్యక్తులకు కూడా సాయం చేయలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఈ మూడున్నరేళ్లలో తాను ఎక్కడా.. ఏ పార్టీ వారిపైనా అక్రమ కేసులు పెట్టించలేదని, పథకాలను ఆపలేదని వ్యాఖ్యానించారు. తనపై కొంతమంది వైసీపీ నాయకులకు అసంతృప్తి ఉండవచ్చన్నారు.
గతంలో జోగి రమేష్ తన అనుచరులతో పాటు చంద్రబాబు నివాసంపైకి వెళ్లారు. ఆ తర్వాతే జోగి రమేష్ కు మంత్రి పదవి వచ్చింది. అలా అనుచరులతో దౌర్జన్యాలకు వెళ్తేనే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే, జోగి రమేష్ ను ఉద్దేశించే పరోక్షంగా వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.