ప్రభుత్వ తీరును తప్పు పట్టిన వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
ఇలా ఎన్నారైలను కూడా భయపెడితే ఇక ఏపీలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎవరైనా ఎలా ముందుకు వస్తారని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిలదీశారు.
ప్రభుత్వంపై మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. గుంటూరులో చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్టు చేయడాన్ని కృష్ణప్రసాద్ తప్పు పట్టారు.
గుంటూరు సభలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. దాన్ని అడ్డుపెట్టుకొని చిలువలు పలువలు చేసి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. కేసుల పేరుతో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు లాంటి వారిని భయపెడితే ఎలా అని ప్రశ్నించారు. ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇలా ఎన్నారైలను కూడా భయపెడితే ఇక ఏపీలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎవరైనా ఎలా ముందుకు వస్తారని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిలదీశారు. తొక్కిసలాట జరిగిన రోజు నుంచి వైసీపీ ఈ ఘటన ఆధారంగా చంద్రబాబు నాయుడుపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఈ చావులకు చంద్రబాబు కారణమంటూ మంత్రులతో సహా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. అందుకు భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడడం చర్చనీయాంశమైంది.
వసంత కృష్ణ ప్రసాద్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బహిరంగ సభలోనే ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, ఎలాంటి పనులు జరగడం లేదని చెప్పారు. గ్రామస్థాయిలో వైసీపీ నాయకులు చాలామంది ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నారని విమర్శలు చేసిన ఉదంతం ఉంది.