టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం
భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా గతంలోనూ పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. వైఎస్సార్ కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించిన భూమన.. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు.
భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా గతంలోనూ పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. పేద వధూవరుల కోసం కల్యాణమస్తు, వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు చేయించేందుకు దళిత గోవిందం వంటి కార్యక్రమాలు గతంలో తన హయాంలో అమలు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి పౌర్ణమికీ తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహించేలా చేశారు. ప్రస్తుతం చేపట్టిన బాధ్యతల్లో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఇప్పటివరకు టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల 8వ తేదీతో ముగిసింది.