ఏపీలో బాబు నాయకత్వంలోనే కాంగ్రెస్‌ పార్టీ నడుస్తోంది..

ఎల్లో మీడియాలో రాసిన వార్తలను పట్టుకొని కడపలో బై ఎలక్షన్‌ వస్తుందని, తాను షర్మిలను గెలిపించేందుకు అక్కడే ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రవిచంద్రారెడ్డి అన్నారు.

Advertisement
Update:2024-07-09 18:58 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్‌ పార్టీ నడుస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి విమర్శించారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఎప్పుడో భూస్థాపితమైందని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తన అన్న జగన్‌ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోందని, వైఎస్సార్‌ మీద అంత మమకారం ఉంటే.. ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

ఎల్లో మీడియాలో రాసిన వార్తలను పట్టుకొని కడపలో బై ఎలక్షన్‌ వస్తుందని, తాను షర్మిలను గెలిపించేందుకు అక్కడే ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రవిచంద్రారెడ్డి అన్నారు. సొంత ప్రాంతమైన మహబూబ్‌నగర్‌లో గెలిపించుకోలేకపోయిన రేవంత్‌.. కడపలో షర్మిలను గెలిపిస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య లోపాయికారీ ఒప్పందాలు అందరికీ తెలుసని ఆయన విమర్శించారు.

విభజన వల్ల జరిగిన నష్టం కాంగ్రెస్‌ పార్టీ చేసిన పాపమేనని రవిచంద్రారెడ్డి అన్నారు. ప్రత్యేక హెూదా, పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్‌ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోతే.. అంతకుమించిన పథకాలు అమలు చేసిన జగన్‌.. ప్రజల గుండెల్లో గొప్పగా ఉన్నారని ఆయన తెలిపారు. జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి పొత్తుల కోసం వెంపర్లాడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాము పొత్తులు పెట్టుకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News