రాష్ట్రంలో అరాచకాలపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

Advertisement
Update:2024-07-18 16:15 IST

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన కొనసాగుతోందని రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ మండిప‌డ్డారు. లోకేష్‌ చెప్పినట్టుగా రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 రోజులుగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, కక్షసాధింపు దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చూస్తుంటే.. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..? అనే అనుమానం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్ర గవర్నర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాజమండ్రిలో గురువారం మార్గాని భ‌ర‌త్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వినుకొండలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నడిరోడ్డుపై ముస్లిం మైనారిటీ వ్యక్తిని హత్య చేసిన ఘటన రాష్ట్రంలో జరుగుతున్న అరాచ‌క పాల‌న‌కు పరాకాష్ట అని మాజీ ఎంపీ భరత్‌ చెప్పారు. ఎంపీ మిథున్‌రెడ్డి తన నియోజకవర్గానికి వెళితే ఆయనపై కక్షతో టీడీపీ నేత‌లు రాళ్ల దాడికి తెగ‌బ‌డ్డార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పోలీస్‌ శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌ ఈ ఘటనలపై వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గత 40 రోజులుగా జరుగుతున్న దాడులపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించి శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ భ‌ర‌త్‌ డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News