ఇప్పుడు ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చినా లాభం లేదు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయన ఐదేళ్లపాటు జగన్ లా ప్రజల మధ్యన ఉండి, వారితో మమైకమైతే పార్టీని ముందుకు తీసుకువెళ్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
Update:2023-02-04 14:58 IST

వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా లాభం లేదని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని వ్యాఖ్యానించారు. జగన్ లా ఐదేళ్లపాటు జనంలో ఉంటే ఆ తర్వాత గెలిచే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.

టీడీపీకి వచ్చే ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. చంద్రబాబు వయస్సు 80 ఏళ్ల‌కు దగ్గరగా ఉండటంతో ఇప్పుడు టీడీపీ గెలవకపోతే ఆ తర్వాత పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

లోకేష్ లీడర్ గా తనను తాను ఇంకా నిరూపించుకోలేకపోవడంతో టీడీపీని ఇప్పుడు అధికారంలోకి తీసుకురావాల్సి ఉండటం అనివార్యంగా మారింది. ఇప్పుడు పార్టీ గెలిస్తే లోకేష్ కు అప్పజెప్పడానికి అవకాశం ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందువల్లే పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు కూడా చివరి ఛాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

చంద్రబాబు అనుకూల వ్యక్తులు ఈ విషయంలో ఆయనకు మద్దతు ఇస్తుండగా మరికొందరు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో పర్యటిస్తున్న సమయంలో కూడా పార్టీ కార్యకర్తల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. కొంతమంది చంద్రబాబు ముందే కాబోయే సీఎం ఎన్టీఆర్.. అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకువస్తే లోకేష్ కు పోటీ అయ్యే అవకాశం ఉండడంతో ఎన్టీఆర్ ను పార్టీలోకి తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

కాగా ఇవాళ మీడియాతో వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని, ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చిన లాభం లేదని ఆమె అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయన ఐదేళ్లపాటు జగన్ లా ప్రజల మధ్యన ఉండి, వారితో మమైకమైతే పార్టీని ముందుకు తీసుకువెళ్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. లక్ష్మీపార్వతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News