పత్తికొండలో గోరంట్ల మాధవ్ జెండా.. క్యాస్ట్ కార్డు కలిసొచ్చేనా..?
తన జిల్లా కాదు, తాను పుట్టిన ఊరు కాదు, అత్తవారి ఇళ్లూ పత్తికొండలో లేదు. మరి ఏ ధైర్యంతో హిందూపురం నుంచి పత్తికొండ రావాలనుకుంటున్నారని అందరికీ అనుమానాలు వస్తున్నాయి.
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయ వ్యూహంపై ఇటీవల రకరకాల కథనాలు వస్తున్నాయి. సీఐగా దూకుడు పనితీరుతో పేరు సంపాదించి 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై హిందూపురం ఎంపీగా పోటీచేసి సంచలనం సృష్టించారు మాధవ్. ఎంపీగా ఎన్నిక ఎంత సెన్సేషన్ అయ్యిందో ఆ తరువాత వివాదాలతో ఇంకా ఫేమస్ అయిపోయారు గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కర్నూలు జిల్లా వైపు గోరంట్ల చూపు పడిందని టాక్.
కర్నూలు జిల్లా పత్తికొండపై ప్రత్యేక దృష్టిసారించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తరచూ ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఏవో పరిచయాలు, వివాహాది శుభకార్యాలు అనుకుంటే పొరపాటే. రాజకీయంగా తనకి సురక్షితమైన స్థానం కోసం అన్వేషణలోనే గోరంట్ల మాధవ్ పత్తికొండ రాకపోకలు అని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇప్పటి నుంచి ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలని లైనులో పెట్టిన మాధవ్ అంతా అనుకున్నట్టు జరిగితే పత్తికొండ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానని అధిష్టానం వద్ద ప్రపోజల్ పెట్టనున్నారని తెలుస్తోంది.
తన జిల్లా కాదు, తాను పుట్టిన ఊరు కాదు, అత్తవారి ఇళ్లూ పత్తికొండలో లేదు. మరి ఏ ధైర్యంతో హిందూపురం నుంచి పత్తికొండ రావాలనుకుంటున్నారని అందరికీ అనుమానాలు వస్తున్నాయి. గోరంట్ల మాధవ్ పత్తికొండపై దృష్టిసారించేందుకు ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. అదే తన సామాజికవర్గం. ఈ ప్రాంతంలో కురుబ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తాను కురబ కావడంతో తన కమ్యూనిటీ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడతాయని, వైసీపీ ఇమేజ్ ఎలాగూ ఉండనే ఉంటుందనే ధీమాతో మాధవ్ ఉన్నారని తెలుస్తోంది.
పత్తికొండ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కేడర్‌లోనూ బలంగానే ఉన్నారు. ద్వితీయశ్రేణి నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. అయితే నియోజకవర్గంలో వైసీపీ నేతలైన కెడీసీసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మలతో కొంత గ్యాప్ ఉందని సమాచారం. ఈ సందు వాడుకుని వారితో టచ్‌లోకెళ్లిన గోరంట్ల మాధవ్ తన ఆలోచనని వారి వద్ద బయటపెట్టారని తెలుస్తోంది. వారి మద్దతు దొరికినా, దొరకకపోయినా హిందూపురం ఎంపీ ప్రయత్నాలన్నీ పత్తికొండ చుట్టూనే తిరుగుతున్నాయి.