కక్షలేదు, కాకరకాయాలేదు- ఇప్పటం ఎపిసోడ్‌పై వైసీపీ
ఇప్పటం గ్రామంలోనూ రోడ్లు మీద నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చేసేందుకు జనసేన ప్లీనరీ కంటే ముందే జనవరి నెలలోనే మార్కింగ్ వేశారని గుర్తు చేస్తున్నారు.
మార్చి నెలలో జనసేన పార్టీ ప్లీనరీ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జరిగింది. ఇప్పుడు అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. జనసేన ప్లీనరీకి, ఇప్పుడు ఆక్రమణల కూల్చివేతకు లింక్ పెట్టి జనసేన, టీడీపీ పెద్దెత్తున ప్రచారం చేస్తున్నాయి. జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చారన్న కక్షతోనే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటం గ్రామంలో జనసేన సానుభూతిపరుల నిర్మాణాలను కూల్చేస్తోందని నిన్నటి నుంచి పెద్దెత్తున ప్రచారం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై అటు వైసీపీ వివరాలను వెల్లడించింది. ఆక్రమణల కారణంగా రోడ్లు ఇరుకైపోవడంతో వాటి తొలగింపు కార్యక్రమం రెండేళ్ల క్రితమే మొదలైందని.. ఇప్పటం గ్రామంలోనూ రోడ్లు మీద నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చేసేందుకు జనసేన ప్లీనరీ కంటే ముందే జనవరి నెలలోనే మార్కింగ్ వేశారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు.
గ్రామంలో 75 అడుగుల ఆర్ అండ్ బీ రోడ్లులో 10 అడుగుల మేర ఆక్రమించుకుని 54 మంది వ్యక్తులు నిర్మాణాలు చేశారని.. అలా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేతలకు అందరూ సహకరించగా.. కేవలం నలుగురు జనసేన వ్యక్తులు మాత్రం రాద్దాంతం చేస్తున్నారని చెబుతున్నారు. ఆక్రమణల కూల్చివేతలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో పాటు వైసీపీ కార్యకర్తల ఇళ్ల ప్రహరీ గోడలు కూడా ఉన్నాయని వైసీపీ చెబుతోంది. రోడ్లు విస్తరణకు వారంతా సహకరించగా.. కేవలం ఆఖరిలో జనసేనకు సంబంధించిన వారు మాత్రమే ఇదంతా కక్ష సాధింపు, జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చినందుకే కూల్చివేస్తున్నారంటూ రాద్దాంతం చేస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తోంది.
ప్రస్తుతం తొలగించింది కూడా రోడ్ల మీద నిర్మించిన ప్రహరీ గోడలను మాత్రమేనని.. ఎవరి ఇళ్లను కూల్చలేదని అధికారులు కూడా చెబుతున్నారు. జనసేన ప్లీనరీ సమయంలో ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు ఇస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారని.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. ముందు ఆ మాట నిలబెట్టుకోవాలని వైసీపీ వారు డిమాండ్ చేస్తున్నారు.