అధిష్టానానికి అనుకూలం, అప్పలరాజుకి వ్యతిరేకం..
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధిష్టానానికి మాత్రం తాము అనుకూలమేనంటున్నారు.
ఎన్నికలకు రెండేళ్ల ముందుగా అధికార వైసీపీలో అక్కడక్కడా గ్రూపు రాజకీయాలు బయట పడుతున్నాయి. ఇటీవల తాడికొండలో ఇలాంటి గ్రూపులు కట్టకముందే అధిష్టానం కొత్తగా అక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్ ని తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం కాస్త హడావిడి చేసినా, వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ డొక్కావైపు సర్దుకుంది. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. తాజాగా పలాస నియోజకవర్గంలో ఏకంగా మంత్రిపైనే తిరుగుబావుటా ఎగురవేశారు కొంతమంది స్థానిక నేతలు.
వరుసగా రెండుసార్లు జగన్ కేబినెట్ లో స్థానం సంపాదించారు మంత్రి అప్పలరాజు. పలాస నియోజకవర్గంలోని వజ్రపు కొత్తూరు మండలంలో ఆయనకు వ్యతిరేక వర్గం ఉంది. వారంతా హార్డ్ కోర్ వైసీపీ అభిమానులే. కానీ వారికి అప్పలరాజుతో పడటంలేదు. మందస, పలాసలో కూడా మరికొంతమంది చోటా మోటా నాయకులకు మంత్రితో విభేదాలున్నాయి. దీంతో మంత్రి కూడా వారిని ఓ కంట కనిపెడుతూ వచ్చారు. తనకు వ్యతిరేకం అనుకున్నవారికి పోటీగా అదే మండలంలో మరో వర్గాన్ని అప్పలరాజు చేరదీస్తున్నారు. వైసీపీలోనే తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో అప్పలరాజు వ్యతిరేక వర్గం గత రెండేళ్లుగా రగిలిపోతోంది. ఇప్పుడు ఆ విభేదాలన్నీ బహిర్గతం అయ్యాయి. మంత్రికి వ్యతిరేకంగా ఏకంగా రహస్య సమావేశాలు జరుగుతున్నాయి.
అధిష్టానానికి ఫిర్యాదు..
వజ్రపు కొత్తూరు, మందస, పలాస మండలాలకు చెందిన దువ్వాడ హేమ బాబు చౌదరి, జుత్తు నీలకంఠం, దువ్వాడ శ్రీకాంత్.. మరికొందరు నేతలు అప్పలరాజుకి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. మంత్రి అప్పలరాజు ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ తాము సమావేశాలు పెట్టుకుంటున్నామని చెబుతున్నారు అసమ్మతి నేతలు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు. సీనియర్లను విస్మరిస్తున్న మంత్రికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటున్నారు. అయితే ఈ అసమ్మతి వర్గంమంతా అధిష్టానానికి తాము అనుకూలం అని ప్రకటించడం విశేషం. అంటే వీరి టార్గెట్ అప్పలరాజుకి వచ్చే ఎన్నికల్లో సీటు రాకుండా చేయడమేనని తేలిపోయింది. మరి అధిష్టానం దీనిపై దృష్టిసారిస్తుందా..? వీరి ఆరోపణలు పరిగణలోకి తీసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తుందా..? లేక అప్పలరాజుకే ప్రయారిటీ ఇచ్చి అసమ్మతి నేతల్ని లైట్ తీసుకుంటుందా..? వేచి చూడాలి.