జగన్‌ మార్కు మార్పులు.. - 2 స్థానాల్లో సమన్వయకర్తల నియామకం

గుంటూరు మేయర్‌గా ఉన్న కావటి మనోహర్‌నాయుడును చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమిస్తున్నట్టు ప్రకటించింది.

Advertisement
Update:2024-03-13 10:32 IST

వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మార్కు రాజకీయంలో భాగంగా సమన్వయకర్తల నియామకాన్ని వ్యూహాత్మకంగా చేపడుతున్నట్టు అర్థమవుతోంది. తాజాగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకాన్ని బట్టి అది స్పష్టమవుతోంది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు తొలి జాబితాల్లో ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం నుంచి సీటు కేటాయించకపోవడం.. మరెక్కడా ఆయనకు సీటు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో గుడివాడ అమర్‌నాథ్‌కు సీటు లేనట్టే అని అంతా భావించారు. అయితే మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో గుడివాడ అమర్‌నాథ్‌ను గాజువాక అసెంబ్లీ సమన్వయకర్తగా నియమిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది.

తాజా జాబితాలో గాజువాకతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గానికి కూడా సమన్వయకర్తను మార్చుతున్నట్టు ప్రకటించింది. గుంటూరు మేయర్‌గా ఉన్న కావటి మనోహర్‌నాయుడును చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే చిలకలూరిపేట నియోజకవర్గానికి సమన్వయకర్తను ప్రకటించినప్పటికీ తాజాగా దానిని మార్చుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో పాటు కర్నూలు మేయర్‌ బీవై రామయ్యను కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో.. మేయర్‌ అభ్యర్థిగా 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ సి.సత్యనారాయణమ్మను పార్టీ ఎంపిక చేసింది. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఆదేశాలతో ఈ నియామకాలు చేసినట్లు ఆ పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనినిబట్టి చూస్తే జగన్‌ సమన్వయకర్తల నియామకంలో వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారని తెలుస్తోంది. అభ్యర్థి ఎవరవుతారనే కచ్చితమైన క్లారిటీ ప్రతిపక్షాలకు అందకుండా వారిని అయోమయానికి గురిచేయడమే జగన్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News