వైసీపీకే జైకొట్టిన ఉపాధ్యాయులు.. - రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీ విజయం
తూర్పు రాయలసీమ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1043 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుతో పోటీచేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిపై గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఉపాధ్యాయ ఓటర్లు వారికే జై కొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోను, విభజన తర్వాత కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీచేసిన వైసీపీ.. అన్ని స్థానాలనూ దక్కించుకున్న విషయం తెలిసిందే. అదే ఊపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కనిపించింది. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ స్థానాలను అధికార పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల మెజారిటీతో ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. ఈ స్థానం నుంచి టీడీపీ మద్దతుతో పోటీచేసిన పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
తూర్పు రాయలసీమ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1043 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుతో పోటీచేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిపై గెలుపొందారు.
మరోపక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వాటిలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర స్థానంలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు.