జగన్‌కు ఉమెన్ సెక్యూరిటీ వింగ్

సీఎంలకు ప్రజల నుంచి ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు, సవాళ్ళు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిదే. ఇక్కడ ఎవరైనా ఫెయిలైతే వీళ్ళపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు.

Advertisement
Update:2023-07-15 10:30 IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రక్షణ కోసం ప్రత్యేకంగా ఉమెన్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటవుతోంది. సుమారు 70 మంది మహిళా కానిస్టేబుళ్ల‌తో ప్రత్యేక రక్షణ దళాన్ని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు రెడీ చేస్తున్నారు. వీవీఐపీలకు భద్రత కల్పించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధ‌తులపై నిపుణులతో వీరికి శిక్షణ ఇప్పిస్తున్నారు. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 70 మంది మహిళా కానిస్టేబుళ్ల‌ను ఎంపికచేసి అందరికీ ఒంగోలులోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పిస్తున్నారు.

సీఎం బందోబస్తు, కాన్వాయ్, వీవీఐపీ భద్రతా విధులపై ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ముఖ్యమంత్రులకు భద్రత కల్పించటం అంటే కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే కొందరు సీఎంలు సడన్‌గా జనాల్లోకి వెళ్లిపోతారు. అప్పుడు ప్రమాదం ఏ మూలనుండి ముంచుకొస్తుందో ఎవరు ఊహించ‌లేరు. జనాల్లోకి వెళ్ల‌వ‌ద్దని భద్రతా సిబ్బంది చెప్పినా కొందరు ముఖ్యమంత్రులు వినరు. ఎన్నికల సమయాల్లో అయితే మరీ దూకుడుగా ఉంటారు.

అలాంటప్పుడు సీఎంలకు ప్రజల నుంచి ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు, సవాళ్ళు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిదే. ఇక్కడ ఎవరైనా ఫెయిలైతే వీళ్ళపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. తొందరలోనే రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఉమెన్ సెక్యూరిటీ వింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న జగన్ దగ్గరకు మహిళలు పెద్దసంఖ్యలో వస్తుంటారు. కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు, కాన్వాయ్ వెళ్తున్నపుడు మహిళలు జగన్‌ను ఆపుతుంటారు.

ఇలాంటి సమయాల్లో వాళ్లంతా చుట్టుముట్టినప్పుడు జగన్‌కు అసౌకర్యం కలగడం సహజం. కాబట్టి ప్రత్యేకంగా మహిళా భద్రత ఉంటే బాగుంటుందని ఉన్నతాధికారులు భావించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందుకనే సీఎంతో చెప్పుకుంటే త‌మ‌ సమస్యలు పరిష్కారమవుతాయని ఎవ‌రైనా అనుకోవటం సహజం. అందుకనే జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మహిళలు పెద్దఎత్తున కనబడుతున్నారు. వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉమెన్ సెక్యూరిటీ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీరంతా తొందరలోనే శిక్షణ పూర్తిచేసుకుని డ్యూటీలో చేరబోతున్నట్లు సమాచారం. ఉమెన్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న మొదటి సీఎం జగనే అవుతారేమో.

Tags:    
Advertisement

Similar News