రానున్న ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందా..!?
ఇటీవల కాలం వరకూ ఎవరితోనైనా పొత్తులకు సిద్ధమన్నట్టు చెప్పిన పవన్ మాటల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా 'తనకు ఒక అవకాశం ఇవ్వండి. మార్పు అంటే ఏమిటో చూపెడతాం' అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధులను నిలబెడతానని పవన్ చెప్పడం ఆయన ఇటు బిజెపితో కానీ టిడిపితో కానీ పొత్తులపై మనసు మార్చుకున్నారా అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందా..? ప్రధాని మోడీ విశాఖ పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆలోచనలు మార్చుకున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల క్రితం ఆయన విజయనగరం జిల్లా గుంకలాం గ్రామం లో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు ముందు వరకూ పవన్ కల్యాణ్ ప్రతి మాటలోనూ వైసిపి ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించేవారు. ప్రబుత్వంపై దూకుడుగా వ్యవహరించేవారు. కానీ విశాఖ లో ప్రధానితో భేటీ అయిన తర్వాత పవన్ మాటతీరులోనూ, వ్యవహార శైలిలోనూ మార్పు స్పష్టంగా కనబడుతోంది. తాజాగా ఆయన గుంకలాంలో చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనం.
ఇటీవల కాలం వరకూ వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎవరితోనైనా పొత్తులకు సిద్ధమన్నట్టు చెప్పిన పవన్ మాటల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా 'తనకు ఒక అవకాశం ఇవ్వండి. మార్పు అంటే ఏమిటో చూపెడతాం' అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో ' రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధులను నిలబెడతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తా' అనడం వంటి ప్రసంగం తీరుతో ఆయన ఇటు బిజెపితో కానీ టిడిపితో కానీ పొత్తులపై మనసు మార్చుకున్నారా అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి అంటున్నారు.
ఇప్పటం గ్రామంలో పరిణామాల తర్వాత పార్టీకి ప్రజల నుంచి ఆదరణ పెరిగిందనే భావన పార్టీ నాయకులు, కార్యకర్తలలో వ్యక్తమవుతున్నట్టు వారి మాటలను బట్టి అర్ధమవుతోంది. అంటే..ఈ పరిణామాలతో ధైర్యం పెరిగిందా లేక ప్రధాని మోడీ నుంచి ఏదైనా భరోసా లభించిందా అనేది అర్ధం అవడం లేదు. కానీ మోడీతో భేటీ తర్వాత వచ్చిన వార్తలను బట్టి చూస్తే పవన్ ప్రతిపాదనలకు మోడీ ఇప్పటికిప్పుడే సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. రూట్ మ్యాప్ ఇస్తామని చెప్పడం, కలిసి పనిచేద్దాం అని ప్రధాని చెప్పారంటూ కూడా వార్తలు వచ్చాయి. ప్రధానితో భేటీ తర్వాత పవన్ కూడా..'నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. పరిస్థితులను వివరించాను. ఆయన సావధానంగా విన్నారు. కలిసి పనిచేద్దాం అని చెప్పారు' అంటూ ముక్తసరిగా ముగించారు. ఇక అక్కడనుంచి పవన్ మాట తీరులో, వైఖరిలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఎక్కడా పొత్తుల ప్రస్తావన, ప్రబుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననడం గానీ ప్రసంగాల్లో చోటు చేసుకోవడం లేదు.
విశాఖలో గర్జన పరిణామాల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలపడం, ఇద్దరి భేటీ తర్వాత పొత్తులు ఖరారవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో అప్పుడే సీట్ల పంపకాలపై కసరత్తులు జరగుతున్నాయనే వార్తలూ వచ్చాయి. ఆ తర్వాత ఇప్పటం సంఘటనలతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. ఇంతలోనే మోడీ విశాఖ పర్యటనకు రావడం, ఎట్టకేలకు పవన్ ఆయనతో భేటీ కావడంతో ఏదో జరిగిపోతోంది, పవన్ ప్రధానికి అన్నీ చెప్పేశారంటూ జనసైనికులు ఊదరగొట్టారు. ప్రధానితో పవన్ ఏం మాట్లాడారు..ఆయనకు ఆయన ఏం చెప్పారో ఎవరికీ స్పష్టంగా తెలియదు.కానీ ఆ తర్వాతే అంతా తారుమారైంది. ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా పరిస్థితులు గమనిస్తూ ప్రస్తుతానికి తటస్థంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపద్యంలో జనసేన వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మారిన పవనాల వాటం రానున్న రోజుల్లో ఏ తీరం చేరుతుందో ఎదురు చూడాల్సిందే.