యాడ్స్, టీజ‌ర్సేనా..? ప్రచారం చేపట్టేది లేదా..?

ఒకవైపు ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఎన్నికలకు కనీసం రెండు నెలల సమయం కూడా లేదు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అడుగు తీసి బయట పెట్టడం లేదు.

Advertisement
Update:2024-03-19 23:40 IST

టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాకముందు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉంటుందని ఆ మధ్య ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చుపెట్టి అన్ని వసతులతో వారాహి వాహనాన్ని సిద్ధం చేయించారు. అయితే ఇప్పటివరకు ఆ వాహనాన్ని ఏపీ పర్యటన కోసం ఒకే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ సీట్లలో మూడో వంతులో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ పొత్తులో ఆ పార్టీకి 21 సీట్లు మాత్రమే దక్కాయి.

జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు పొత్తులో ఉన్న మిగతా పార్టీల కోసమైనా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. ఇదిలావుంటే ఒకవైపు ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఎన్నికలకు కనీసం రెండు నెలల సమయం కూడా లేదు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అడుగు తీసి బయట పెట్టడం లేదు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన జెండా, ప్రజాగళం సభలకు మాత్రమే ఆయన హాజరయ్యారు. జనసేన పార్టీ కోసం రూపొందించిన ఓ యాడ్ లో కనిపించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కాగా.. అది కూడా ఎన్నికల కోసమే ప్రత్యేకంగా విడుదల చేసినట్లు ఉంది. కేవలం గాజు గ్లాస్ ను ప్రమోట్ చేయడానికే ఆ కంటెంట్ ను రూపొందించారన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రచారానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో సమావేశం అవుతూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రచార కార్యక్రమాలు చేపట్టకపోవడంపై టీడీపీ, బీజేపీ నాయకులనుంచి అసహనం వ్యక్తం అవుతోంది. పవన్ ప్రచారం చేపట్టకపోతే పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీలకు ఏం ఉపయోగం కలుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వారాహి వాహనాన్ని బయటకు తీసి రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా జనసైనికులు కూడా కోరుతున్నారు.

రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా 21 స్థానాలకే పరిమితమై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్ ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితం అవుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం ప్రచారం అయిన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టకపోతే జనసేన రాష్ట్రంలో ఒక ప్రాంతానికే పరిమితమైన పార్టీగా గుర్తిస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అడుగు తీసి బయట పెడతారో.. లేకపోతే సమావేశాలకు, వీడియోల విడుదలకే పరిమితం అవుతారో వేచి చూడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News