పాయకరావుపేటలో బాబూరావుకి డాక్టర్‌తో జగన్ చెక్..?

పాయకరావుపేటలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు బాబూరావుకి పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మండల స్థాయి నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
Update:2023-10-06 11:14 IST

పాయకరావుపేటలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ని కలిసిన డాక్టర్ బుడుమూరి బంగారయ్య వ‌చ్చే ఎన్నికల్లో తనకి పాయకరావుపేట నుంచి టికెట్ ఇవ్వాలని కోరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన‌ బంగారయ్య.. 31,189 ఓట్ల తేడాతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చేతిలో ఓడిపోయారు. అయితే నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

పాయకరావుపేటలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు బాబూరావుకి పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మండల స్థాయి నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్లకార్డుల్ని ప్రదర్శించడంతో పాటు.. ఎమ్మెల్యేకి వ్య‌తిరేకంగా గ‌ట్టిగానే త‌మ స్వ‌రాన్ని వినిపించారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావును మారుస్తారని గత కొన్నిరోజుల నుంచి ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది.

అనితకి లైన్ క్లియర్.. కానీ?

మరోవైపు పాయకరావుపేటపై టీడీపీ కూడా ఫోకస్ పెట్టింది. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ.. జనసేన నుంచి మాత్రం ఆమెకి సపోర్ట్ లభించడం లేదు. 2019 ఎన్నికలకు ముందు కూడా `అనిత వద్దు.. టీడీపీ ముద్దు` అంటూ పెద్ద ఎత్తున టీడీపీ కేడర్ ర్యాలీలు చేయడంతో టీడీపీ అధిష్టానం ఉన్నపళంగా అనితని తప్పించి ఆమె స్థానంలో డాక్టర్ బంగారయ్యను నిలబెట్టింది. కానీ.. ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే ప్రస్తుతం బంగారయ్య అధికార పార్టీలోకి వెళ్లిపోవడంతో మళ్లీ అనితకి పాయ‌క‌రావుపేట‌ నుంచి లైన్ క్లియరైంది.

ఒకే దెబ్బకి.. రెండు పిట్టలు

బంగారయ్యకి జ‌గ‌న్ ఛాన్స్ ఇస్తే.. టీడీపీ నేత అనితతో పాటు పార్టీ క్యాడ‌ర్‌లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బాబూరావుకి కూడా ఒకేసారి చెక్ చెప్పినట్లవుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం బంగారయ్య స్థానికంగా మంచి పేరు సాధించుకున్నారు. గత ఎన్నికల్లో బాబూరావుకి 98,745 ఓట్లు పడగా.. బంగారయ్యకి 67,556 ఓట్లు వచ్చాయి. అలానే జనసేన తరఫున పోటీ చేసిన నక్కా రాజబాబుకి 15,921 ఓట్లు పడ్డాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. దాంతో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబుతున్నారో చూడాలి..!

Tags:    
Advertisement

Similar News