సవాల్‌ను స్వీకరిస్తే సంచలనమేనా..?
మంత్రి సవాలును స్వీకరించేంత ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. పెద్దిరెడ్డిని రాజకీయంగా గట్టిదెబ్బకొట్టాలని అనుకుంటే చంద్రబాబుకు ఇంతకుమించిన అవకాశం మళ్ళీరాదు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక చాలెంజ్ విసిరారు. అదేమిటంటే.. కుప్పంలో చంద్రబాబు నాయుడుపై పోటీచేస్తారట. అలాకాకపోతే చంద్రబాబే తనపై పుంగనూరులో పోటీచేయాలట. తాను మాత్రం ఇటు పుంగనూరులోను అటు కుప్పంలో కూడా పోటీచేయటానికి సిద్ధమే అని చంద్రబాబు చిరకాల ప్రత్యర్ధి పెద్దిరెడ్డి పెద్ద సవాలే విసిరారు. తన సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా..? అని కూడా పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మంత్రి సవాలు చూస్తే రీజనబుల్ గానే ఉంది.
పెద్దిరెడ్డిని బట్టలూడదీసి కొడతాను, ఓడిస్తాను, పెద్దిరెడ్డి పెద్ద పుడింగా అని ఊరికే మాటలతో సరిపెట్టేబదులు ఇప్పుడు మంత్రి సవాలను స్వీకరిస్తే.. నిజంగా పెద్ద సంచలనమే అవుతుంది. గెలుపుమీద అంత నమ్మకమే ఉంటే చంద్రబాబు అయినా పుంగనూరులో పోటీచేయాలి. లేకపోతే పెద్దిరెడ్డిని కుప్పంలో పోటీచేయమని చెప్పాలి. రెండింటిలో చంద్రబాబు ఏదిచేసినా రాబోయే ఎన్నికల్లో పెద్ద సంచలనమే అవుతుంది.
మరి, మంత్రి సవాలును స్వీకరించేంత ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. పెద్దిరెడ్డిని రాజకీయంగా గట్టిదెబ్బకొట్టాలని అనుకుంటే చంద్రబాబుకు ఇంతకుమించిన అవకాశం మళ్ళీరాదు. ఎలాగూ చాలెంజ్ చేసిందే పెద్దిరెడ్డి కాబట్టి సమస్య ఏదన్నా ఉంటే అది మంత్రికే వస్తుంది. చంద్రబాబు జాగ్రత్తగా పావులు కదిపితే చిరకాల ప్రత్యర్థిని దెబ్బకొట్టడం పెద్ద కష్టం కాదేమో.
జిల్లాలో నువ్వా-నేనా అన్నట్లుగా సంవత్సరాలుగా సాగుతున్న వీళ్ళిద్దరి మధ్య పోరాటానికి మంచి ముగింపు పలికినట్లవుతుంది. చంద్రబాబుకు ఎలాగూ వచ్చేఎన్నికలే దాదాపు చివరి ఎన్నికలనే చెప్పాలి. ఎందుకంటే.. చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు క్లైమ్యాక్సుకు వచ్చేసినట్లు అనుకోవాలి. కాబట్టి సవాలును స్వీకరించి పెద్దిరెడ్డిని గట్టిదెబ్బ కొట్టగలిగితే చంద్రబాబు ఇంతకుమించింది ఏముంటుంది..? మరి మంత్రి చాలెంజ్‌కు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో అని జనాలందరు ఎదురు చూస్తున్నారు. స్వీకరిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా..?