జగన్ అష్టదిగ్బంధన వ్యూహం ఫలిస్తుందా..?
గత టీడీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలుగుదేశంలో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి.
తెలుగుదేశం పార్టీ పుంజుకోకుండా వైసీపీ అధినేత జగన్ పన్నుతోన్న అష్టదిగ్బంధన వ్యూహం ఫలిస్తుందా..? లేదా అనేది ఎన్నికల ఫలితాల సమయానికి తేలుతుంది. అప్పటివరకూ తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకూ జగన్ టామ్ అండ్ జెర్రీ గేముతో హడలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టు బలమైన మీడియా. ఆ మీడియా గ్రూపుల్లో ఇంకా బలమైనది ఈనాడు. మాయఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈనాడు ప్రాణం మార్గదర్శిలో ఉందని కనిపెట్టిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి చిలకని పట్టేశారు. మాయలఫకీరు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మార్గదర్శిపైకి తుపాకీ ఎక్కుపెట్టి ఈనాడుని ఉక్కిరిబిక్కిరి చేసి తెలుగుదేశం పార్టీని కొట్టాలనుకున్న వ్యూహం పకడ్బందీగా అమలు చేశారు. ప్రస్తుతానికైతే మార్గదర్శి విషయంలో ఏపీ సర్కారు దూకుడు రామోజీరావుతోపాటు తెలుగుదేశం పార్టీని బాగా డిస్ట్రబ్ చేస్తున్న అంశంగా నిలిచింది.
తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద ఆర్థిక అండదండలు అందించే తెరవెనుక శక్తిగా నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అని ప్రచారం ఉంది. నారాయణని ఫిక్స్ చేయగలిగితే టీడీపీకి ఆర్థిక మద్దతు రూటు కట్ అవుతుందనే లక్ష్యంతో వైసీపీ అమలు చేసిన వ్యూహం వర్కవుట్ బాగానే అయ్యింది. రాబోయే ఎన్నికలకి నారాయణ మళ్లీ యాక్టివ్ రోల్ పోషించేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో టెన్త్ పేపర్ లీకేజీ కేసు, రాజధాని భూముల కేసు, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులు నారాయణని చుట్టుముట్టాయి. అన్ని దారులూ మూసుకుపోయి, విచారణ సంస్థలకు అడ్డంగా ఆధారాలతో బుక్కయిపోయిన నారాయణ కోర్టు ఇచ్చిన వెసులుబాటుతో ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
గత టీడీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలుగుదేశంలో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్, రాజధాని ల్యాండ్ స్కాములతోపాటు టీడీపీ ఐదేళ్ల పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలపై విచారణకి అవకాశం చిక్కింది. అతి తక్కువ సమయమే ఉన్నా, కీలకమైన టైములో తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టులాంటి వాళ్లంతా ఏదో ఒక స్కామో, ఆరోపణకో చిక్కారు. ఇప్పుడు ఏకంగా గత ప్రభుత్వం నిర్ణయాలపై సిట్ దర్యాప్తుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇంకెన్ని సంచలనాలు బయటకొస్తాయో వేచిచూడాలి.